Warne
-
వార్న్ వారియర్స్ క్లీన్‌స్వీప్
మళ్లీ ఓడిన సచిన్ సేన ముగిసిన ఆల్ స్టార్స్ సిరీస్ లాస్ ఏంజెల్స్: క్రికెట్ ప్రపంచం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించి, ప్రత్యక్షంగా అమెరికా అభిమానులకు ఆనందం పంచిన ఆల్ స్టార్స్ సిరీస్ ఆదివారం ముగిసింది. దిగ్గజ క్రికెటర్లంతా ఒక చోట చేరి టి20 వినోదం పంచిన ఈ టోర్నీలో మొత్తంగా సచిన్ బ్లాస్టర్స్‌పై వార్న్ వారియర్స్‌దే పైచేయి అయింది. ఇక్కడి డాడ్జర్ స్టేడియంలో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో వారియర్స్ 4 వికెట్ల తేడాతో బ్లాస్టర్స్‌ను ఓడించింది. ఫలితంగా 3-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ సచిన్ (27 బంతుల్లో 56; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ముందుండి నడిపించగా, మాజీ సహచరుడు సౌరవ్ గంగూలీ (37 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. జయవర్ధనే (18 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కార్ల్ హూపర్ (22 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) కూడా రాణించారు. వెటోరికి 3 వికెట్లు దక్కాయి. అనంతరం వారియర్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 224 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కలిస్ (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), పాంటింగ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సంగక్కర (21 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లతో పాటు సైమండ్స్ (19 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కలిస్, పాంటింగ్ కలిసి ఆరో వికెట్‌కు 37 బంతుల్లోనే 88 పరుగులు జోడించడం జట్టుకు విజయాన్నందించింది. సంగక్కరకు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారం లభించింది. సచిన్, సౌరవ్ దూకుడు... టాస్ గెలిచిన బ్లాస్టర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడిన సెహ్వాగ్ (15 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సచిన్‌తో కలిసి తొలి వికెట్‌కు 23 బంతుల్లోనే 55 పరుగులతో శుభారంభం అందించారు. అనంతరం సచిన్, జయవర్ధనే ఇదే జోరును కొనసాగిస్తూ రెండో వికెట్‌కు 34 బంతుల్లోనే 74 పరుగులు జోడించారు. వీరిద్దరు మూడు పరుగుల వ్యవధిలోనే వెనుదిరిగారు. ఆ తర్వాత గంగూలీ, హూపర్ చెలరేగి 51 బంతుల్లోనే 86 పరుగులు చేయడంతో బ్లాస్టర్స్ భారీ స్కోరు సాధించింది. కీలక భాగస్వామ్యాలు... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆంబ్రోస్ వేసిన తొలి బంతికే వాన్ (0) బౌల్డ్ కావడంతో వారియర్స్ మొదటి వికెట్ కోల్పోయింది. రెండో వికెట్‌కు 25 బంతుల్లో 50 పరుగులు జోడించిన తర్వాత సైమండ్స్ అవుట్ కాగా, లక్ష్మణ్ చక్కటి ఫీల్డింగ్‌కు హేడెన్ (12) రనౌటయ్యాడు. ఈ దశలో సంగక్కర, రోడ్స్ (17) మధ్య 58 పరుగుల భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. సెహ్వాగ్ వేసిన ఆఖరి ఓవర్లో విజయానికి మూడు పరుగుల దూరంలో కలిస్ అవుటైనా...ఐదో బంతిని వార్న్ సిక్సర్ బాది తన జట్టుకు క్లీన్ స్వీప్ విజయాన్ని అందించాడు. -
ఆ జ్ఞాపకాలు మళ్లీ....
షార్జా స్టేడియంలో షేన్‌వార్న్ బౌలింగ్‌లో సచిన్ ముందుకొచ్చి లాంగాన్‌లోకి కొట్టిన భారీ సిక్సర్... 17 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతోంది. మళ్లీ అలాంటి ఆటను తర్వాతి తరం చూడలేదని అప్పట్లో అనుకునేవాళ్లు. సచిన్, షేన్‌వార్న్‌ల సమరాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయిన ఈ తరం కుర్రాళ్లకు ఇది నిజంగా పండగే. మరోసారి ఈ దిగ్గజ క్రికెటర్లు ముఖాముఖి తలపడబోతున్నారు. ఆల్‌స్టార్స్ సిరీస్‌లో భాగంగా జరిగే మూడు టి20 మ్యాచ్‌లలో సచిన్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్ జట్లు తలపడబోతున్నాయి. ఎనిమిది దేశాలకు చెందిన 30 మంది దిగ్గజ క్రికెటర్లు ఇందులో ఆడబోతున్నారు. గంగూలీ, సంగక్కర, పాంటింగ్.... ఇలా రిటైరైన స్టార్ క్రికెటర్లను మళ్లీ చూసేందుకు ఇది గొప్ప అవకాశం. సిరీస్ ఉద్దేశం అమెరికాతో పాటు క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్‌ల మదిలో వచ్చిన ఆలోచన ఇది. అనుకున్నదే తడవుగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన ఆటగాళ్లను సంప్రదించి వారిని రెండు జట్లుగా విడదీశారు. సచిన్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్‌గా విడిపోయి మూడు టి20 మ్యాచ్‌లు ఆడనున్నారు. కేవలం మ్యాచ్‌లను ఆడటమే కాకుండా మొత్తం ఎనిమిది రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు కూడా ఏర్పాట్లు జరిగాయి. ఇందులో భాగంగా తమ అభిమాన ఆటగాళ్లతో కలిసి ఆటకు ముందు రోజు రాత్రి అభిమానులు విందులో పాల్గొనవచ్చు. ఇందుకోసం రూ.50 వేల నుంచి రూ.లక్షా 71 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వేదికలు అమెరికాలో క్రికెట్ స్టేడియాలు లేకపోవడంతో న్యూయార్క్, హోస్టన్, లాంస్ ఏంజిల్స్ నగరాల్లోని బేస్‌బాల్ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందుకు డ్రాప్ ఇన్ పిచ్‌లను వాడనున్నారు. ఆటగాళ్లు మొత్తం ఎనిమిది దేశాలకు చెందిన 30 మంది ఆటగాళ్లు ఇందులో ఆడనున్నారు. భారత్ నుంచి సచిన్, గంగూలీ, లక్ష్మణ్, అగార్కర్, సెహ్వాగ్, సమీర్ డిఘే.. ఆసీస్ నుంచి వార్న్, హేడెన్, పాంటింగ్, సైమండ్స్, మెక్‌గ్రాత్.. దక్షిణాఫ్రికా నుంచి పొలాక్, కలిస్, డొనాల్డ్, క్లూసెనర్, రోడ్స్.. ఇంగ్లండ్ నుంచి మైకేల్ వాన్, స్వాన్.. విండీస్ నుంచి వాల్ష్, అంబ్రోస్, హూపర్, లారా... శ్రీలంక నుంచి మురళీధరన్, సంగక్కర, జయవర్ధనే.. కివీస్ నుంచి వెటోరి.. పాక్ నుంచి అక్రం, మొయిన్ ఖాన్, అక్తర్, సక్లైన్ ముస్తాక్ పాల్గొననున్నారు.