ఆ జ్ఞాపకాలు మళ్లీ....
షార్జా స్టేడియంలో షేన్‌వార్న్ బౌలింగ్‌లో సచిన్ ముందుకొచ్చి లాంగాన్‌లోకి కొట్టిన భారీ సిక్సర్... 17 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతోంది. మళ్లీ అలాంటి ఆటను తర్వాతి తరం చూడలేదని అప్పట్లో అనుకునేవాళ్లు. సచిన్, షేన్‌వార్న్‌ల సమరాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయిన ఈ తరం కుర్రాళ్లకు ఇది నిజంగా పండగే.
మరోసారి ఈ దిగ్గజ క్రికెటర్లు ముఖాముఖి తలపడబోతున్నారు. ఆల్‌స్టార్స్ సిరీస్‌లో భాగంగా జరిగే మూడు టి20 మ్యాచ్‌లలో సచిన్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్ జట్లు తలపడబోతున్నాయి. ఎనిమిది దేశాలకు చెందిన 30 మంది దిగ్గజ క్రికెటర్లు ఇందులో ఆడబోతున్నారు. గంగూలీ, సంగక్కర, పాంటింగ్.... ఇలా రిటైరైన స్టార్ క్రికెటర్లను మళ్లీ చూసేందుకు ఇది గొప్ప అవకాశం.
సిరీస్ ఉద్దేశం
అమెరికాతో పాటు క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్‌ల మదిలో వచ్చిన ఆలోచన ఇది. అనుకున్నదే తడవుగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన ఆటగాళ్లను సంప్రదించి వారిని రెండు జట్లుగా విడదీశారు.
సచిన్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్‌గా విడిపోయి మూడు టి20 మ్యాచ్‌లు ఆడనున్నారు. కేవలం మ్యాచ్‌లను ఆడటమే కాకుండా మొత్తం ఎనిమిది రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు కూడా ఏర్పాట్లు జరిగాయి. ఇందులో భాగంగా తమ అభిమాన ఆటగాళ్లతో కలిసి ఆటకు ముందు రోజు రాత్రి అభిమానులు విందులో పాల్గొనవచ్చు. ఇందుకోసం రూ.50 వేల నుంచి రూ.లక్షా 71 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
వేదికలు
అమెరికాలో క్రికెట్ స్టేడియాలు లేకపోవడంతో న్యూయార్క్, హోస్టన్, లాంస్ ఏంజిల్స్ నగరాల్లోని బేస్‌బాల్ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందుకు డ్రాప్ ఇన్ పిచ్‌లను వాడనున్నారు.
ఆటగాళ్లు
మొత్తం ఎనిమిది దేశాలకు చెందిన 30 మంది ఆటగాళ్లు ఇందులో ఆడనున్నారు. భారత్ నుంచి సచిన్, గంగూలీ, లక్ష్మణ్, అగార్కర్, సెహ్వాగ్, సమీర్ డిఘే.. ఆసీస్ నుంచి వార్న్, హేడెన్, పాంటింగ్, సైమండ్స్, మెక్‌గ్రాత్.. దక్షిణాఫ్రికా నుంచి పొలాక్, కలిస్, డొనాల్డ్, క్లూసెనర్, రోడ్స్.. ఇంగ్లండ్ నుంచి మైకేల్ వాన్, స్వాన్.. విండీస్ నుంచి వాల్ష్, అంబ్రోస్, హూపర్, లారా... శ్రీలంక నుంచి మురళీధరన్, సంగక్కర, జయవర్ధనే.. కివీస్ నుంచి వెటోరి.. పాక్ నుంచి అక్రం, మొయిన్ ఖాన్, అక్తర్, సక్లైన్ ముస్తాక్ పాల్గొననున్నారు.