
ఊసరవెల్లిలా రంగులు మార్చుతోంది!
సాధారణంగా ఈత కొలను(స్విమ్మింగ్ పూల్) అనగానే మనకు నీలి రంగులో ఉండే నీళ్లు గుర్తొస్తాయి. వాస్తవానికి ప్రతి కాంపిటీషన్లోనూ స్విమ్మింగ్ పూల్ లో ఉపయోగించే వాటర్ నీలి రంగులో దర్శనమిస్తుంది. అయితే రియోలో మాత్రం కాస్త విచిత్రం చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు తెల్లారేసరికల్లా ఆకుపచ్చ రంగులోకి మారాయి. అధికారులు చెప్పే పొంతనలేని మాటలతో ఏకీభవించకుండా, ఊసరవెల్లిలాగ స్విమ్మింగ్ పూల్స్ కూడా రంగులు మార్చుతున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వివాదం రియోలో బుధవారం చర్చనీయాంశమైంది.
రియోలో ఓ ఈత కొలను ఆకుపచ్చగా మారిపోయింది. ముందు రోజు వరకు నీళ్లు నీలం రంగులో ఉన్నాయి. ఐతే తెల్లారేసరికి ఆకుపచ్చ రంగులోకి మారడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదీకాక బుధవారం నీళ్ల రంగు మారిన కొలనులోనే పోటీలు నిర్వహించారు. అక్కడి వాతావరణంలో మార్పుల వల్లే నీళ్ల రంగు మారే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.
అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య అధికారులు మాట్లాడుతూ.. ఈత కొలనులో నీళ్ల రంగు మారిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. నీటిని శుద్ధిచేయడానికి, స్విమ్మర్లకు ఆరోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రకాల రసాయనాలు అందులో కలిపినట్లు వెల్లడించారు. పీహెచ్ స్థాయి సమతౌల్యం దెబ్బతినడం వల్లే నీళ్ల రంగులో మార్పు సంభవించి ఉండొచ్చునని అభిప్రాపడ్డారు. నీళ్లను నీలి రంగులోకి తీసుకొచ్చేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.