
అతడి బ్యాటింగ్ అద్భుతం: వార్నర్
హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక విజయాన్ని నమోదు చేయడంలో ఆ జట్టు కెప్టెన్ మరోసారి కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఇది సమిష్టి విజయమని, ఏ ఒక్కరికో సొంతం కాదని వార్నర్ పేర్కొన్నాడు. నిన్న జరిగిన మ్యాచ్ తో ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన విలియమ్సన్ ను ప్రశంసించాడు. విలియమ్సన్ (38 బంతుల్లో 50; 7 ఫోర్లు) ఇన్నింగ్స్ తోడవ్వడంతోనే భారీ స్కోరును సాధించామన్నాడు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో రాణించాడని, అతను క్లాస్ ఆటగాడని సన్ రైజర్స్ కెప్టెన్ వార్నర్ కితాబిచ్చాడు.
జట్టు ఆటగాళ్లు అందరూ రాణించారని, బెంగళూరు ముందు భారీ లక్ష్యాన్ని నిలిపి విజయాన్ని సొంతం చేసుకున్నామని పేర్కొన్నాడు. తాను సెంచరీ మిస్ కావడంపై డేవిడ్ వార్నర్ (50 బంతుల్లో 92; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విలియమ్సన్ బ్యాటింగ్ అద్భుతమని... అతని చేరికతో మా బలం పెరిగిందని, టోర్నీలో మిగతా మ్యాచ్ లలో మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేశాడు.విలియమ్సన్ తో కలిసి భాగస్వాయ్యాలు నెలకొల్పి జట్టును విజయపథంలో నడిపిస్తానని వార్నర్ వివరించాడు.