భువనేశ్వర్ కుమార్(ఫైల్‌ఫొటో)
కేప్‌టౌన్:దక్షిణాఫ్రికాతో జరిగిన టీ 20 సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్న భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. గత కొంతకాలంగా తన బౌలింగ్‌లో వైవిధ్యం పెరిగిందని పేర్కొన్న భువీ.. ఈ మార్పుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కారణమని స‍్పష్టం చేశాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్న క్రమంలో మాట్లాడిన భువీ..' ప్రతీ సిరీస్‌కు మనం ఎలా సన్నద్ధం అవుతున్నామన్నదే ఇక్కడ ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతీ సిరీస్‌కు ముందు ఒక కచ‍్చితమైన ప్రణాళిక రచించుకుంటా. ఇటీవల నా బౌలింగ్‌లో వైవిధ్యం పెరిగింది.
ఇందుకు కారణం ఐపీఎల్. భారత బౌలర్లను ఒక ఆలోచనలో పడేసి రాటుదేలేలా చేసింది మాత్రం ఐపీఎలే. మాలో మార్పుకు కారణం అదే. పవర్ ప్లేలో సాధ్యమైనంత నియంత్రణతో బౌలింగ్ చేయడం ఎలానో ఐపీఎల్ ద్వారా నేర్చుకున్నాం. ఈ క్రమంలోనే నకుల్ బాల్స్, స్లో బంతులను సంధించి సక్సెస్ అయ్యాం. ఇదే మంత్రాన్ని అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌లో కూడా ప‍్రయోగిస్తూ ముందుకు వెళుతున్నాం. ప్రధానంగా విదేశాల్లో వికెట్ల తీయడాన్ని వంట బట్టించుకున్నాం. ఇదే ప్రదర్శనను ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో కూడా పునరావృతం చేస్తాం' అని భువీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment