
దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్
జోహన్నెస్‌బర్గ్ : మొదటి మూడు వన్డేలు సొంత గడ్డపై ఓడిపోవడంతో దక్షిణాఫ్రికా టీం సభ్యులంతా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని..అయినా ఫాంలోకి వస్తామని ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ.. సిరీస్ సొంతం చేసుకోవడానికి నాలుగో వన్డే తమకు డూ ఆర్ డై మ్యాచ్ లాంటిదని అభిప్రాయపడ్డారు. వన్డేల్లో 2013 నుంచి తమ టీం సిరీస్‌లో వెనకబడలేదని, మొదటి సారి టీం ఇండియా ఆధిక్యత కనబరుస్తోందని చెప్పారు. ఒక వేళ నాలుగో వన్డేలో కూడా ఓడిపోతే సిరీస్ పోయినట్లేనని మోరిస్ అన్నారు. ఎటువంటి ఒత్తిడి లేకపోతే క్రికెట్‌లో ఏం మజా ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఇదంతా క్రికెట్‌లో భాగమేనన్నారు. రేపు జరగబోయే మ్యాచ్‌లో తాము తమ శక్తికి మించి ప్రదర్శన చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాక స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ నాలుగో వన్డేలో జట్టుతో చేరడంతో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. నాలుగో వన్డేలో డేవిడ్ మిల్లర్ కానీ ఖాయా జోండోలలో ఒకరికే అవకాశం లభించవచ్చునని తెలిపారు. మణికట్టు బౌలర్లైన చాహల్ ,కుల్దీప్‌లను దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్లు ఎదుర్కోవడం పెద్ద ఛాలెంజేనని వ్యాఖ్యానించారు. మూడు వన్డేల్లో మొత్తం 30 వికెట్లలో 21 వికెట్లు వీరిద్దరే సాధించారని పేర్కొన్నారు.
వీరిని ఎదుర్కోవడానికి ఎటువంటి ప్లాన్లు సిద్ధం చేయలేదని, కాస్త హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. బ్రెస్ట్ క్యాన్సర్ నిర్మూలనకు ఫండ్స్ కలెక్ట్ చేసేందుకు నిర్వహించబోయే పింక్ వన్డేలో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా టీం ఓడిపోలేదని గుర్తు చేశారు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 10న నాలుగో వన్డే జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment