భారత్తో మ్యాచ్.. అంత ఈజీ కాదు!
తొలి టెస్టుతో పోల్చితే ఇప్పుడు జట్టు కాస్త బలోపేతం అయిందని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అంటున్నాడు. నేడు(శనివారం) ఇక్కడి సబీనా పార్క్ స్డేడియంలో రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో హోల్డర్ మీడియాతో మాట్లాడాడు. బౌలింగ్ విభాగం కొంత మెరుగ్గా కరిపించినా, భారత్ లాంటి జట్టుపై అంతగా ప్రభావం చూపిస్తామో లేదోనని హోల్డర్ అందోళన చెందుతున్నాడు. ఆటగాళ్ల ఫామ్ కూడా తమకు ప్రతికూలాంశమని, బ్యాటింగ్ లైనఫ్ కూడా అంత పటిష్టంగా లేదని విండీస్ కెప్టెన్ వెల్లడించాడు. ఇప్పటికీ తొలిటెస్టు ఇన్నింగ్స్ ఓటమిని విండీస్ జీర్ణించుకోలేకపోతోంది.
కొన్ని పరిస్థితులలో విండీస్ సమిష్టిగా రాణిస్తే విజయం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. బౌలర్లు సుదీర్ఘ సెషన్లపాటు బంతులు వేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించాడు. రెండో టెస్టులో కెరీర్ ఆరంగేట్రం చేయనున్న యువ ఆల్ రౌండర్ అల్జారీ జోసెఫ్ గురించి తనకేం తెలియదన్నాడు. అతడి ఆట తాను ఎప్పుడూ చూడలేదని, అయితే సత్తామేరకు అతడు రాణించినందున జాతీయ జట్టులోకి వచ్చాడని పేర్కొన్నాడు. జట్టు అతడికి విలువైన సూచనలు ఇచ్చేందుకు సిద్ధమని.. అతడు రాణిస్తే జట్టుకు కాస్తయినా మేలు జరుగుతుంనది విండీస్ కెప్టెన్ హోల్డర్ వివరించాడు.