కోహ్లీని టార్గెట్ చేసిన ఇంగ్లండ్ బౌలర్
టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్ లోనే శతకంతో చెలరేగాడు. తొలివన్డేలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హీరో కేదార్ జాదవ్ (76 బంతుల్లో 120; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి (105 బంతుల్లో 122; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్బుత శతకాలతో భారత్ అసాధారణ రీతిలో ఇంగ్లండ్ పై విజయాన్ని సాధించింది. అయితే రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మన్లకు అలాంటి అవకాశం ఇవ్వనని ఇంగ్లండ్ పేసర్ జేక్ బాల్ అంటున్నాడు. గురువారం కటక్‌లో ఇరుజట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. టీమిండియా కెప్టెన్ కోహ్లీని పరుగులు చేయకుండా అడ్డుకుంటే తమ విజయం నల్లేరుపై నడకేనని చెప్పాడు.
సాధ్యమైనంత వరకు కోహ్లీని క్రీజులో కుదురుకోనీయకుండా అతడికి ముకుతాడు వేస్తామని, ఇందుకు షార్ట్ పిచ్ బంతులను మార్గం ఎంచుకుంటామని పేసర్ జేక్ బాల్ తెలిపాడు. కోహ్లీని ఔట్ చేయడానికి తమ వద్ద మరిన్ని ఎత్తులతో తాము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. పుణే వన్డేలో 3/67తో రాణించిన ఈ పేసర్.. కోహ్లీలాంటి అత్యుత్తమ ఆటగాడిని త్వరగా పెవిలియన్ బాట పట్టించాలని, లేకపోతే తమ జట్టు మరోసారి మూల్యం చెల్లించుకోక తప్పదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ ఆటను చూశాను.. ఇప్పుడు వన్డేల్లోనూ కోహ్లీ కుమ్మేస్తున్నాడని ప్రశంసించాడు.