
భారత్ చేరిన విండీస్ క్రికెట్ జట్టు
కోల్‌కతా: వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్ చేరుకుంది. ధోని సేనతో ఇక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు డారెన్ స్యామీ నేతృత్వంలోని విండీస్ జట్టు సోమవారం కోల్‌కతాకు వచ్చింది. స్థానిక విమానాశ్రయం నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య విండీస్ ఆటగాళ్లు నేరుగా తాము బస చేసే హోటల్‌కు వెళ్లారు.
సచిన్‌కు ఫేర్‌వెల్ టోర్నీ అయినా ఈ సిరీస్‌లో తొలి టెస్టు ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో వచ్చే నెల 6 నుంచి 10 వరకు జరగుతుంది. ఇది సచిన్‌కు 199వ టెస్టు కాగా... 200 టెస్టు ముంబైలోని వాంఖడేలో 14 నుంచి 18 వరకు జరగుతుంది. పర్యాటక జట్టు మొదట ఉత్తరప్రదేశ్ జట్టుతో మూడు రోజుల సన్నాహక మ్యాచ్ ఆడుతుంది.
ఈ మ్యాచ్ జాదవ్‌పూర్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో 31న మొదలవుతుంది. ముందనుకున్న షెడ్యూలు ప్రకారం ఈ మ్యాచ్ కటక్‌లో జరగాల్సివున్నప్పటికీ ఎడతెరిపిలేని వర్షాల వల్ల కోల్‌కతాకు మార్చారు. టెస్టు సిరీస్ తర్వాత జరిగే మూడు వన్డేల సిరీస్‌లో రెండో వన్డే నవంబర్ 24న విశాఖపట్నంలో జరగనుంది.