విజయంపై విండీస్‌ గురి  | West Indies Focus To Win Series Against England | Sakshi
Sakshi News home page

విజయంపై విండీస్‌ గురి 

Jul 12 2020 2:04 AM | Updated on Jul 12 2020 5:09 AM

West Indies Focus To Win Series Against England - Sakshi

అనూహ్య పరిస్థితుల్లో జరుగుతున్న చారిత్రాత్మక టెస్టులో విజయం సాధించే అద్భుత అవకాశం వెస్టిండీస్‌ ముందు నిలిచింది. నాలుగో రోజు చివరి గంట ముందువరకు సాఫీగా ఇన్నింగ్స్‌ సాగిస్తూ పైచేయి సాధించినట్లు కనిపించిన ఇంగ్లండ్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. ‘డ్రా’కే ఎక్కువ అవకాశాలు కనిపించిన మ్యాచ్‌లో విండీస్‌ బౌలర్లు చెలరేగి ఆటను మలుపు తిప్పారు. మ్యాచ్‌ చివరి రోజు ఆదివారం విండీస్‌ ఎంత లక్ష్యాన్ని ఛేదించగలదనేది ఆసక్తికరం.

సౌతాంప్టన్‌: శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఒక దశలో ఇంగ్లండ్‌ స్కోరు 249/3. కానీ విండీస్‌ బౌలర్ల విజృంభణతో అంతా మారిపోయింది. 30 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్‌ 5 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా ప్రత్యర్థికి విజయావకాశాన్ని అందించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 104 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. జాక్‌ క్రాలీ (127 బంతుల్లో 76; 8 ఫోర్లు), డామ్‌ సిబ్లీ (164 బంతుల్లో 50; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా... కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (79 బంతుల్లో 46; 6 ఫోర్లు), రోరీ బర్న్స్‌ (104 బంతుల్లో 42; 5 ఫోర్లు) రాణించారు. ప్రస్తుతం క్రీజులో ఆర్చర్‌ (5 బ్యాటింగ్‌), వుడ్‌ (1 బ్యాటింగ్‌) ఉన్నారు. విండీస్‌ బౌలర్లలో గాబ్రియెల్‌ 3 వికెట్లు పడగొట్టగా... జోసెఫ్, ఛేజ్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 170 పరుగుల ఆధిక్యంలో ఉంది. చివరి రోజు మిగిలిన 2 ఇంగ్లండ్‌ వికెట్లను తొందరగా తీసి 200లోపు లక్ష్యం ఉంటే విండీస్‌ విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  

కీలక భాగస్వామ్యాలు... 
ఇంగ్లండ్‌ స్కోరులో ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అందరూ చెప్పుకోదగ్గ స్కోరుతో తమ వంతు పాత్ర పోషించారు. నాలుగో రోజు ఆటను కొనసాగిస్తూ ఓపెనర్లు బర్న్స్, సిబ్లీ తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యంతో పునాది వేశారు. ఈ క్రమంలో వీరిద్దరి కొన్ని చక్కటి షాట్లు ఆడారు. లంచ్‌కు కొద్ది సేపు ముందు ఎట్టకేలకు బర్న్స్‌ను అవుట్‌ చేసి ఛేజ్‌ ఈ భాగస్వామ్యానికి తెర దించాడు.తొలి సెషన్‌లో 30 ఓవర్లలో ఇంగ్లండ్‌ 64 పరుగులు చేసింది. రెండో సెషన్‌లో 161 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి సిబ్లీ వెనుదిరగ్గా... అనవసరపు షాట్‌కు ప్రయత్నించి డెన్లీ (29) అవుటయ్యాడు.

రెండో సెషన్‌లో ఇంగ్లండ్‌ 30 ఓవర్లలో 89 పరుగులు చేయగా, విండీస్‌ 2 వికెట్లు పడగొట్టగలిగింది. టీ విరామం తర్వాత క్రాలీతో కలిసి కెప్టెన్‌ స్టోక్స్‌ ధాటిగా ఆడాడు. 80 బంతుల్లో క్రాలీ అర్ధ సెంచరీ మార్క్‌ను చేరుకోగా... 19వ బంతికి తొలి పరుగు తీసిన స్టోక్స్‌ ఆ తర్వాత జోరు పెంచాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు  98 పరుగులు జత చేశారు. అయితే కొత్త బంతితో విండీస్‌ దెబ్బ కొట్టింది. వరుస ఓవర్లలో స్టోక్స్, క్రాలీలను అవుట్‌ చేసి పైచేయి సాధించింది. ఆ వెంటనే బట్లర్‌ (9) కూడా పెవిలియన్‌ చేరాడు. అనంతరం బెస్‌ (3), పోప్‌ (12) లను అవుట్‌ చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టలేదు. 12.3 ఓవర్ల వ్యవధిలో అంతా మారిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement