నంబర్‌వన్ మా లక్ష్యం కాదు
* మంచి క్రికెట్ ఆడడమే ముఖ్యం
* టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి
బెంగళూరు: నిరంతరం మారే ర్యాంకులను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఆడదని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. అలాగే రానున్న రోజుల్లో జరగబోయే టెస్టు మ్యాచ్‌లకు తామెలా సన్నద్ధమయ్యామో వెస్టిండీస్ పర్యటన తేలుస్తుందని అన్నాడు. తమ లక్ష్యం నంబర్‌వన్‌కు చేరడం కాదని, మంచి క్రికెట్ ఆడడమే తమకు ముఖ్యమని తేల్చాడు. కరీబియన్ టూర్‌కు వెళ్లే ముందు కోచ్ అనిల్ కుంబ్లేతో కలిసి చిన్నస్వామి స్టేడియంలో విలేకరుల సమావేశంలో మాట్లాడాడు.
విండీస్‌తో ఈనెల 21 నుంచి భారత జట్టు నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌ను 4-0తో క్లీన్‌స్వీప్ చేస్తే భారత్ నంబర్‌వన్ ర్యాంకును దక్కించుకుంటుంది. ‘ఓ టెస్టు జట్టుగా మాకు మేము సవాల్‌ను ఎదుర్కొంటూ ఓ అంచనాకు రావడానికి ఇదే సరైన అవకాశం. భవిష్యత్‌లో మేమెలా ఆడతామో కొన్ని నెలల్లో తేలుతుంది. ఈ ఫార్మాట్‌లో నంబర్‌వన్ ర్యాంకును పొందడం మా లక్ష్యం కాదు. మా ప్రధాన లక్ష్యం మంచి క్రికెట్ ఆడడమే.
ఒక్కో టెస్టుపై దృష్టి పెడుతూ ముందుకు సాగుతాం’ అని కోహ్లి అన్నాడు. టెస్టు జట్టులో కేఎల్ రాహుల్ ఉన్నా కీపర్‌గా తమ తొలి ప్రాధాన్యం వృద్ధిమాన్ సాహాకేనని తేల్చాడు. దాదాపు 15 నెలలు భారత జట్టుకు దూరంగా ఉన్న పేసర్ మొహమ్మద్ షమీ నాణ్యమైన బౌలర్ అని కొనియాడాడు. టెస్టు మ్యాచ్‌లకు అతడి లైన్ అండ్ లెంగ్త్ సరిగ్గా సరిపోతుందని, విండీస్ పిచ్‌లపై అతడు రాణించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశాడు.
విరాట్ దూకుడును అడ్డుకోను: కుంబ్లే
మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడును తాను అడ్డుకోనని కోచ్ కుంబ్లే తెలిపారు. అయితే తామంతా భారత రాయబారులమనే విషయాన్ని కూడా క్రికెటర్లు గుర్తుంచుకోవాలని సూచించారు. దేనికైనా ఓ హద్దు ఉంటుందని గుర్తుచేశారు. ఏ ఆటగాడి సహజసిద్ధమైన దూకుడును తాను అడ్డుకోనని, కానీ క్రికెట్ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం కూడా వారిపైనే ఉందని అన్నారు. రానున్న 17 టెస్టుల్లో నిలకడగా ఆడి వీలైనన్ని మ్యాచ్‌లను గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఆటను ఆస్వాదించండి: ధోని
బిజీ షెడ్యూల్ ముందుండడంతో మైదానం వెలుపలా, లోపలా సరదాగా ఉండడం ఎంతో ముఖ్యమని వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆటగాళ్లకు తెలిపాడు. ఆదివారం జరిగిన డ్రమ్ సర్కిల్‌లో పాల్గొన్న అనంతరం కొద్దిసేపు క్రికెటర్లతో సంభాషించాడు. తొలిసారిగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కలిగిన అనుభూతే క్రికెట్లోనూ చూపించాలని అన్నాడు. యువ ఆటగాళ్లతో కూడిన టెస్టు జట్టు ఇక సత్తా నిరూపించుకుని భవిష్యత్‌పై భరోసా కల్పించేలా ఆడాల్సిన తరుణం ఇదేనని వారికి హితబోధ చేశాడు.