మాల్యా విల్లాలో రాజభోగాలు అనుభవించా
న్యూఢిల్లీ: వెస్టిండీస్ విధ్వంసక వీరుడు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ గోవాలో ఐదు రోజులు దర్జాగా గడిపాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యజమాని, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విల్లాలో గేల్ రాజభోగాలు అనుభవించాడు. గేల్ తన జీవిత కథ 'సిక్స్ మెషిన్: ఐ డోన్ట్ లైక్ క్రికెట్.. ఐ లవ్ ఇట్' పుస్తకంలో ఈ విషయం రాశాడు.
ఐపీఎల్ సీజన్ ఆడేటపుడు మధ్యలో 5 రోజుల పాటు గేల్కు విరామం వచ్చింది. బెంగళూరు జట్టు మేనేజర్ జార్జి అవినాష్ ద్వారా గోవాలోని మాల్యా విల్లా గురించి తెలుసుకున్న గేల్కు అక్కడ గడపాలన్న కోరిక కలిగింది. ఇంకేముందు గేల్ అడిగితే మాల్యా వద్దంటాడా? అతనికి అన్ని ఏర్పాట్లు చేయించాడు. గేల్ జట్టు సభ్యులతో గాక ఒంటరిగా గోవా వెళ్లాడు. అరేబియా సముద్రం తీరాన కాండోలిమ్ దగ్గర మాల్యాకు అత్యంత విలాసవంతమైన విల్లా ఉంది. ఆ విల్లా ఎలా ఉందంటే గేల్ మాటల్లోనే..
హోటళ్ల కంటే మాల్యా విల్లా పెద్దది. నేను చూసిన ఇళ్లన్నింటికంటే చాలా చల్లగా ఉంటుంది. జేమ్స్బాండ్, ప్లే బాయ్ విల్లాలా ఉంది. తెల్ల కాంక్రీట్, అద్దాలతో చాలా అందంగా దీన్ని నిర్మించారు. దీంట్లో ఓ గది ఇస్తే చాలని భావించా. అయితే నాకోసం మొత్తం బంగ్లాను కేటాయించారు. నేనెక్కడికి వెళ్లినా వెంట ఇద్దరు పనివాళ్లు ఉండేవారు. ఆ విల్లాలో నేను రాజులా గడిపాను. విల్లా మొత్తం కలియతిరిగాను. పూల్ దగ్గరకు వెళ్లగానే కింగ్ ఫిషర్ బీర్లు తీసుకువస్తారు. ఆ విల్లాలో ఎక్కడికి వెళ్లినా కింగ్ ఫిషర్ బీర్లు రెడీగా ఉంటాయి. గోల్ఫ్ కోర్టులో విహరించా. భోజనం ఏం తీసుకుంటారని వంటమనిషి అడిగితే మెనూ అడిగా. దానికి అతను.. మెనూ లేదు సార్, మీరే మెనూ అని బదులిచ్చాడు. విల్లాలోనే థియేటర్లో సినిమా చూశా. గ్యారేజీలోకి వెళ్లి చూస్తే మెర్సిడెజ్ సహా చాలా కార్లు ఉన్నాయి. అయితే నాకు మూడు చక్రాల హార్లీ డేవిడ్సన్ బైక్ నచ్చింది. మాల్యా విదేశాలకు వెళ్లినపుడు ఓ యువకుడు దీనిపై వెళ్తుండగా చూశాడట. ఈ బైక్ను చూసి ముచ్చటపడిన మాల్యా వెంటనే దీన్ని తనకు అమ్మమని ఆ యువకుడిని కోరాడట. మాల్యా బాస్. ఆయన తలచుకుంటే కానిది ఏముంది? ఆ యువకుడు కోరినంత మొత్తం చెల్లించి భారత్కు తీసుకువచ్చాడట. ఆ విల్లాలో ఈ బైక్ను రైడింగ్ చేసి ఎంజాయ్ చేశా. ఆ సమయంలో టర్మినేటర్గా ఫీలయ్యా. కింగ్ఫిషర్ విల్లాకు నేనే కింగ్. ఈ విల్లాను విడిచి వెళ్లాలని అనిపించలేదు. అయితే ఐదు రోజుల విరామం పూర్తవడంతో తప్పనిసరిగా అక్కడి నుంచి బయల్దేరాల్సి వచ్చింది.