
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా యువబౌలర్ చైనామన్ కుల్దీప్ యాదవ్ ఒకప్పుడు ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. ఇక జన్మలో క్రికెట్ ఆడకూడదని కూడా నిర్ణయించుకున్నాడు. కానీ ఇప్పుడతను టీమిండియాలో కీలక బౌలర్. విచిత్రమైన బౌలింగ్ యాక్షన్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసే కుల్‌దీప్ ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాపై టెస్ట్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల్లో 9 వికెట్లతో టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే 13 ఏళ్ల వయసులో ఉన్నపుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు కుల్‌దీప్ శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపాడు.
‘ఉత్తర్ ప్రదేశ్ అండర్ 15 టీమ్ జట్టులో చోటు కోసం చాలా కష్టపడ్డాను. కానీ తనను ఎంపిక చేయకపోవడంతో నిరాశ చెందా. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. జన్మలో ఇక క్రికెట్ జోలికి వెళ్లొద్దని కూడా నిర్ణయించుకున్నా. అసలు స్కూల్లో తనకు క్రికెట్ అంటే ఓ టైంపాస్ గేమ్‌లాగే ఉండేది. కానీ తన తండ్రి ఒత్తిడి మేరకే శిక్షణ తీసుకొని ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారాను. మొదట్లో పేస్ బౌలర్ కావాలని అనుకున్నా. కోచ్ సూచన మేరకు స్పిన్నర్‌గా మారిన’ అని కుల్‌దీప్ యాదవ్ తెలిపాడు.
అప్పట్లో పాక్ పేసర్ వసీమ్ అక్రమ్, ఆసీస్ బౌలర్ షేన్ వార్న్ అభిమానని అతను చెప్పాడు. ముఖ్యంగా వార్న్ బౌలింగ్ ఫుటేజ్ చూసి తాను మెళకువలు నేర్చుకున్నట్లు కుల్‌దీప్ యాదవ్ అన్నాడు. కెప్టెన్ కోహ్లి, ధోనీ తనకెంతగానో మద్దతిస్తున్నారని తెలిపాడు. ప్లేస్టేషన్ 4 తన ఫేవరెట్ వీడియో గేమ్ అని, ఈ గేమ్ ఆడటం ద్వారా తాను నిజ జీవితంలో సమస్యల పరిష్కారాన్ని కూడా సులువుగా చేయగలుగుతున్నానని కుల్‌దీప్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment