సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్ బౌలర్లలో ఈ ఏడు తీవ్ర పోటీ నెలకొంది. అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానం కోసం ఐదుగురు బౌలర్లు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఈ ఏడాది పూర్తి కావడానికి మరో నెలరోజుల సమయం ఉండటంతో ఆ స్థానం ఎవరి దక్కుతుందనే విషయంపై క్రికెట్ అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతేడాది ఏకపక్షంగా 72 వికెట్లతో అశ్విన్ ఈస్థానం దక్కించుకోగా.. రంగనా హెరాత్ 57 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా పేసర్ కేఎస్ రబడ 54 వికెట్లతో ప్రథమ స్థానంలో ఉండగా.. శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ 52, ఆసీస్ స్పిన్నర్ లియోన్ నాథన్ 50, భారత్ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ 48, రవీంద్ర జడేజా 47 వికెట్లతో రేసులో ఉన్నారు.
అయితే దక్షిణాఫ్రికా బౌలర్ రబడాకు అంతగా అవకాశం కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా డిసెంబర్ 26న జింబాబ్వేతో ఏకైక టెస్టు మాత్రమే ఆడనుంది. ఈ ఏకైక టెస్టు తర్వాత కొత్త సంవత్సరంలోనే భారత్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక అగ్రస్థానం దక్కించుకునే అవకాశం ఆసీస్ ప్లేయర్ లియోన్‌కు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంకా మూడు టెస్టులు ఆడే అవకాశం లియోన్‌కు ఉంది. కానీ ఈ సిరీస్ స్పిన్‌కు అంతగా అనుకూలించని ఆస్ట్రేలియాలో జరుగుతోంది.
ఉపఖండ పిచ్‌లపై రెచ్చిపోయే అశ్విన్, జడేజాలకు ఇంకా ఒక ఇన్నింగ్స్, పూర్తి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. కానీ భారత్ దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో ఉంచుకొని పేస్ పిచ్‌లు సిద్దం చేస్తుండటంతో ఈ జోడి అంతగా ప్రభావం చూపలేకపోతుంది. హెరాత్‌కు కూడా ఇదే పరిస్థతి. శ్రీలంకతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో లంక రెండో ఇన్నింగ్స్‌లో, మూడో టెస్టులో ఈ ద్వయం రెచ్చిపోతే అగ్రస్థానం కైవసం చేసుకోవడం అంత కష్టేమేమి కాదు.
Comments
Please login to add a commentAdd a comment