ఈ దిగ్గజ క్రికెటర్ ఎవరో కనుక్కోండి?
న్యూఢిల్లీ: ప్రతీ ఒక్కరి జీవితంలో చిన్నప్పుడు జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఫోటో అనేది ప్రధానంగా ముడిపడి ఉంటుంది. ఆ ఫోటోలను మనం అప్పుడప్పుడు తరచి చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాం. అయితే అవి కేవలం మన కుటుంబం, మన స్నేహితుల వరకే పరిమితమవుతూ ఉంటాయి. కానీ ప్రముఖ వ్యక్తులైతే ..ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులెవరో తెలుసుకోవడానికి యావత్ ప్రపంచానికే ఆసక్తి ఎక్కువ. అటువంటి చిన్న పరీక్షే మీకోసం.
ఇక్కడ ఓ టీమిండియా మాజీ క్రికెటర్ చిన్ననాటి ఫోటో ఒకటి దర్శనిమిస్తోంది. 'మై మదర్ స్ర్కాప్ బుక్' అనే టైటిల్ తో ఒక ప్రముఖ భారత క్రికెటర్ తన ఫోటోను షేర్ చేశాడు. తన చిన్ననాటి ప్రయాణాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఆ ఫోటోలో ఉన్న క్రికెటర్ ఎవరు అనేది కనుక్కోవడానికి ట్రై చేయండి.16 సంవత్సరాల సుదీర్ఘ క్రికెట్ జీవితాన్ని ఆస్వాదించిన ఆ క్రికెటర్.. టెస్టుల్లో పదమూడు వేల రెండొందల ఎనభై ఎనిమిది పరుగులు సాధించాడు. 164 టెస్టులు ఆడి 52.31 సగటుతో టీమిండియాకు అనేక విజయాలను అందించాడు. ఇందులో 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక వన్డే విషయానికొస్తే 344 మ్యాచ్ లు ఆడిన సదరు ఆటగాడు దాదాపు 40 సగటుతో 10,882 పరుగులు చేశాడు. ఈ పరుగుల్లో 12 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. 2012 వ సంవత్సరంలో అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు చెప్పిన ఈ క్రికెటర్ ఎవరో ఇప్పటికే మీకు జ్ఞప్తికి వచ్చే ఉంటుంది. ఊహించారా?లేదా?.. ఒకవేళ కాకపోతే మాత్రం అతనే 'ద వాల్' రాహుల్ ద్రవిడ్.