
కొలంబో: అవినీతి వ్యతిరేక కార్యకలాపాలపై దర్యాప్తులో సహకరించనందుకు ఐసీసీ ద్వారా రెండేళ్ల నిషేధానికి గురైన శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య వ్యవహారంలో మరో స్టార్ మహేల జయవర్ధనే స్పందించాడు. క్రికెట్‌పై అభిమానంతోనే శిక్షను అంగీకరిస్తున్నానన్న జయసూర్య వ్యాఖ్యలను తప్పు పట్టిన అతను.. అలా అయితే విచారణకు ఎందుకు సహకరించలేదని సూటిగా ప్రశ్నిం చాడు.
‘దేశానికి చెందిన ముద్దుల కొడుకు ఒకరు ఇవాళ రెండేళ్ల ఐసీసీ నిషేధానికి గురి కావడం శ్రీలంక క్రికెట్‌లో బాధాకరమైన రోజు. అసలు ఎందుకు సహకరించలేదు? దేశంలో ఎంతో ఆకర్షణీయమైన ఆటను నిజంగా ఎవరైనా అభిమానిస్తుంటే అవినీతిని బయటపెట్టాలి. తర్వాతి తరాన్ని కాపాడుకోవాలి’ అని జయవర్ధనే ట్వీట్ చేశాడు. జయసూర్య కెప్టెన్సీలో జయవర్ధనే 37 టెస్టులు, 114 వన్డేలు ఆడాడు.