'పిచ్ స్లో కావడంతో.. ఛేజింగ్ కష్టమైంది'
రాజ్కోట్: దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో పిచ్ స్వభావం మారడంతో లక్ష్యాన్ని సాధించలేకపోయామని టీమిండియా కెప్టెన్ ధోనీ అన్నాడు. పిచ్ రానురాను స్లోగా మారిందని, దీంతో పరుగులు చేయడం బ్యాట్స్మెన్కు కష్టమైందని చెప్పాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 18 పరుగులతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. 271 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్ లక్ష్యం దిశగా పయనించినా.. చివర్లో కీలక వికెట్లు కోల్పోవడం, సాధించాల్సిన రన్రేట్ ఎక్కువగా ఉండటంతో బోల్తాపడింది.
రాజ్కోట్ వన్డేలో భారత బౌలర్లు రాణించారని ధోనీ కితాబిచ్చాడు. అయితే లక్షసాధనకు దిగాక పిచ్ క్రమేణా నెమ్మదించడంతో, పరుగులు చేయడం కష్టమైందని చెప్పాడు. ఈ వికెట్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని, స్పిన్నర్లకు సహకరించదని మొదట్లో భావించానని అయితే తన అంచనా తప్పిందని మహీ వివరించాడు. ఇక మిడిలార్డర్లో విఫలమవుతున్న రైనాకు ధోనీ అండగా నిలిచాడు. రైనా షాట్ ఆడబోయిముందు కాస్త సమయం తీసుకోవాలని సూచించాడు.