ముంబై :ఇప్పటివరకూ వాంఖడేలో జరిగిన అంతర్జాతీయ టీ20లు 5. ఇందులో టీమిండియా ఆడిన మ్యాచ్‌లు 2. ఈ రెండింటిలోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. దాంతో ఆదివారం శ్రీలంకతో ఈ వేదికగా జరిగే మ్యాచ్‌లో 'బోణి' కొట్టాలని టీమిండియా భావిస్తోంది. మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకున్న టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేయడంతో పాటు వాంఖడే పరాజయాలకు చెక్ పెట్టేందుకు కసరత్తులు చేస్తోంది. 2012, డిసెంబర్ 22వ తేదీన ఇక‍్కడ తొలి టీ 20 ఆడిన టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ జట్టు పరాజయాన్ని చవిచూసింది. ఇక చివరగావాంఖడేలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు ఏడు వికెట్లతో అపజయాన్ని ఎదుర్కొంది.
ఇదిలా ఉంచితే, గత రెండేళ్లుగా స్వదేశంలో లెక్కకు మించి మ్యాచ్‌లు ఆడిన టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా టీమిండియా నిలిచింది. గడిచిన రెండేళ్లలో టీమిండియా 33 టీ 20 మ్యాచ్‌లు ఆడగా, 22 విజయాల్ని ఖాతాలో వేసుకుంది. దాంతో తన సక్సెస్ రేషియోను టీమిండియా మరింత పెంచుకని టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఇప్పటివరకూ టీమిండియా 90 టీ 20 మ్యాచ్‌ల్లో పాల్గొనగా, 54 విజయాల్ని నమోదు చేసింది. ఇక 33 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడగా, ఒకటి టై అయ్యింది. మరో రెండు మ్యాచ్‌ల్లో రద్దయ్యాయి. ప్రస్తుతం టీమిండియా టీ 20 సక్సెస్ రేషియా 1.62గా ఉంది. ఇక్కడ టీమిండియా దాయాది జట్టు పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ టీ20 సక్సెస్ రేషియో 1.60గా ఉంది.
మరొకవైపు ఈ సీజన్‌లో సొంతగడ్డపై చివర మ్యాచ్ ఆడటానికి టీమిండియా సిద్ధమైంది. వచ్చే ఏడాది ఆరంభంలో సఫారీలతో తలపడబోతున్న భారత్.. ఈ ఏడాది చివరగా ఓ మ్యాచ్ ఆడబోతోంది. ఇప్పటికే సిరీస్ ఫలితం తేలిపోయిన నేపథ్యంలో లంకతో ఆఖరి టీ 20 మ్యాచ్ నామమాత్రమే. కాగా, ఇండోర్‌లో జరిగిన గత మ్యాచ్‌లో రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ సాధించి వరల్డ్ రికార్డు సృష్టించాడు. తాజా మ్యాచ్ రోహిత్ శర్మ సొంతగడ్డపై జరుగనుండటంతో మరొకసారి అతని నుంచి భారీ స్కోరు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment