ప్రతీకారం తీర్చుకుంటారా!
మైసూర్: వన్డేల్లో వెస్టిండీస్ ‘ఎ’చేతిలో అనూహ్యంగా ఓడిన భారత్ ‘ఎ’ ఇప్పుడు ప్రతీకార పోరుకు సిద్ధమైంది. చతేశ్వర్ పుజారా నేతృత్వంలోని భారత జట్టు, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ప్రారంభమయ్యే తొలి అనధికారిక టెస్టులో వెస్టిండీస్‌తో తలపడనుంది.
ఇటీవల దక్షిణాఫ్రికాలో భారత్ ‘ఎ’ను విజయవంతంగా నడిపించిన చతేశ్వర్ పుజారా నాయకత్వంలోనే టీమిండియా బరిలోకి దిగుతోంది. వెస్టిండీస్‌తో భారత సీనియర్ జట్టు సిరీస్ ఉండటంతో ఈ సిరీస్‌లో రాణించి సెలక్టర్ల దృష్టిలో పడాలని ప్రయత్నిస్తున్న అనేక మంది యువ ఆటగాళ్లకు ఇదో చక్కటి అవకాశం.
పటిష్టమైన లైనప్: భారత టెస్టు జట్టులో కీలక సభ్యుడిగా మారిన పుజారా ‘ఎ’ సిరీస్‌లో భారీగా పరుగులు సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో అద్భుతంగా రాణించిన అతను అదే జోరు ప్రదర్శిస్తే విండీస్‌కు కష్టాలు తప్పవు. ఇటీవల కివీస్‌పై రాణించిన మన్‌ప్రీత్ జునేజా కూడా కీలక పాత్ర పోషించనున్నాడు.
జీవన్‌జ్యోత్ సింగ్, కేఎల్ రాహుల్, రజత్ పాలివాల్, హర్షద్ ఖడీవాలే రూపంలో జట్టులో ఇతర ప్రధాన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్‌లో చక్కటి అనుభవం భారత్ సొంతం. అశోక్ దిండా, మొహమ్మద్ షమీ ఇప్పటికే భారత సీనియర్ జట్టుకు ఆడగా, పర్వేజ్ రసూల్, ఈశ్వర్ పాండే చక్కటి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా మూడు టెస్టులకూ ఎంపికైన ఏకైక ఆటగాడైన రసూల్ తన ఆల్‌రౌండ్ నైపుణ్యంతో తొలి అవకాశం దక్కించుకోవాలని భావిస్తున్నాడు.