తీవ్ర ఒత్తిడిలో గౌతం గంభీర్!
ఇండోర్: టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గౌతం గంభీర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడా.. అంటే క్రికెట్ విశ్లేషకులు అవుననే జవాబిస్తారు. దాదాపు రెండేళ్ల తర్వాత జట్టులో చోటు దక్కిందని సంతోషపడ్డ గంభీర్ కు తుది పదకొండు మందిలో అవకాశం ఇవ్వకపోవడంతో కాస్త నిరాశ చెందిన విషయం వాస్తవమే. తొలి టెస్టులో గాయపడ్డ ఓపెనర్ లోకేశ్ రాహుల్ స్థానంలో అవకాశం అంటూ గంభీర్ ను ఊరించారు. కానీ, చివరికి కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన రెండో టెస్టులో శిఖర్ ధావన్ ను ఆడించారు. అప్పుడూ ఈ ఢిల్లీ బ్యాట్స్ మన్ కు భంగపాటు తప్పలేదు. మూడో టెస్టులోనైనా గౌతీకి అవకాశం ఇస్తారా.. లేక కర్ణాటకకు చెందిన మిడిలార్డర్ ఆటగాడు కరుణ్ నాయర్ ను జట్టులోకి తెస్తారా అనే అంశాలపై చర్చ జరుగుతుంది.
వాస్తవానికి దులీప్ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్ ల్లోనే నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 356పరుగులు చేసి అద్బుతమైన ఫామ్ లో ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండర్ కు అవకాశం ఇస్తామని చెప్పిన బీసీసీఐ శిఖర్ కు ఛాన్స్ ఇచ్చారు.. కానీ గౌతీ కూడా ఎడం చేతి వాటం ఆటగాడు కాదా అని కొందరు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. గంభీర్ ను టెస్ట్ క్రికెట్ నుంచి శాశ్వతంగా తప్పించాలనుకుంటే మాత్రం.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో న్యూజిలాండ్, భారత్ మధ్య జరగనున్న చివరిదైన మూడో టెస్టులో ఆడిస్తారని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరేంద్ర సెహ్వాగ్ కు కూడా సరైన వీడ్కోలు దక్కించుకోకుండానే ఆటకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ప్రశ్నార్థకంగా మారిన గంభీర్ భవితవ్యం తేలనుందని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. గంభీర్ జట్టులో స్థానం కోల్పోయి రెండేళ్లు గడిచిపోయింది. చివరగా 2014లో ఇంగ్లండ్ తో సిరీస్ ఆడాడు.