భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. వర్షం ముంచెత్తుతోంది! | Will Rain Affect India vs Pakistan Match at the World Cup | Sakshi
Sakshi News home page

భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. వర్షం ముంచెత్తుతోంది!

Published Sun, Jun 16 2019 9:33 AM | Last Updated on Sun, Jun 16 2019 9:41 AM

Will Rain Affect India vs Pakistan Match at the World Cup - Sakshi

మాంచెస్టర్‌: భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగుతుందా..!  సగటు అభిమానిని ఇప్పుడు పీడిస్తున్న ధర్మ సందేహమిది. జట్లు, బలాబలాల సంగతులు ఎలా ఉన్నా ఈ వరల్డ్‌కప్‌ ఫలితాలను వర్షం కూడా శాసిస్తోంది. వాన కారణంగా రద్దయిన నాలుగు మ్యాచ్‌లలో భారత్‌ మ్యాచ్‌ కూడా ఉంది. కివీస్‌తో మ్యాచ్‌ పోయినా పెద్దగా పట్టించుకోలేదు కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్‌ మాత్రం కచ్చితంగా జరగాలని అంతా కోరుకుంటున్నారు. అయితే మాంచెస్టర్‌లో పరిస్థితి మాత్రం అంత ఆశాజనకంగా లేదు. ఇంగ్లండ్‌లో వాతావరణం గురించి దాదాపు కచ్చితమైన సమాచారం అందించే ఏజెన్సీలు అన్నీ ఆదివారం వర్షం పడుతుందనే చెబుతున్నాయి.

ఇందులో మరో మాట కూడా తేడా లేదు. మ్యాచ్‌ జరిగే సమయంలోనే వానకు అవకాశం ఉందని, మధ్యాహ్నం తర్వాత ఎక్కువ కావచ్చని కూడా తెలుస్తోంది. నిజానికి శనివారం రోజంతా వాతావరణం బాగానే ఉంది. కొద్ది సేపు ఎండ కూడా కాయడంతో అభిమానులు సంతోషించారు. అయితే భారత జట్టు ప్రాక్టీస్‌ ముగించిన పది నిమిషాల తర్వాత చినుకులు మొదలయ్యాయి. సాయంత్రానికి వర్షం జోరు పెరిగింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో కూడా అక్కడ భారీ వర్షం కురుస్తోంది. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచినా ఔట్‌ఫీల్డ్‌ పనితీరుపైనే సందేహాలు ఉన్నాయి. చిన్న జల్లులకే సాయంత్రం మైదానంలో వేర్వేరు చోట్ల నీళ్లు నిలిచిపోయాయి.

ఇలాంటి స్థితిలో మ్యాచ్‌ కోసం గ్రౌండ్‌ను ఎలా సిద్ధం చేస్తారో చూడాలి. ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానం ఈ వరల్డ్‌కప్‌లో ఒక సెమీఫైనల్‌ సహా ఆరు మ్యాచ్‌లకు వేదిక కాగా, ఇదే తొలి మ్యాచ్‌.  చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ చూసేందుకు అభిమానులు పెద్ద మొత్తం వెచ్చించారు. అదృష్టవశాత్తూ టికెట్‌ దక్కించుకున్నవారు ఎప్పుడెప్పుడు మైదానంలో అడుగు పెడదామా అని చూస్తుంటే... మరికొందరు దీనిని మంచి ఆదాయమార్గంగా భావించారు. ‘వియాగోగో’ అనే వెబ్‌సైట్‌ ద్వారా తమ వద్ద ఉన్న టికెట్లను అధిక ధరకు ‘రీసేల్‌’ చేసేందుకు సిద్ధమయ్యారు. రీసేల్‌లో ఒక్కో టికెట్‌ ధర భారత కరెన్సీలో కనీసం రూ. 20 వేలు పలుకుతోంది. గరిష్టంగా ఇది రూ. 62 వేలకు వరకు వెళ్లటం విశేషం. నిజంగా వానతో మ్యాచ్‌ రద్దయితే వీరి గుండె బద్దలవడం ఖాయం!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement