జోరు కొనసాగాలి
ఐదు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన జట్టు సిరీస్ విజయానికి దాదాపు చేరువైనట్లే. భారత జట్టు కూడా ఇప్పుడు ఇలాంటి పటిష్ట స్థితిలోనే ఉంది. తొలి రెండు వన్డేల్లో శ్రీలంకను చిత్తు చేసిన కోహ్లి సేన... అదే జోరు కొనసాగించి హైదరాబాద్‌లోనే సిరీస్ ఫలితాన్ని తేల్చేయాలనే ఉత్సాహంతో ఉంది. ఇక్కడే సిరీస్ గెలిస్తే.. చివరి రెండు వన్డేలకు కావలసినన్ని ప్రయోగాలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
సాక్షి, హైదరాబాద్: భారత్‌తో ఐదు వన్డేల సిరీస్ ఆడేందుకు అయిష్టంగానే వచ్చిన శ్రీలంక క్రికెటర్లు... ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా తమ స్థాయికి తగ్గ ఆటతీరు చూపించలేకపోయారు. బౌలింగ్ విభాగంలో కొత్త ముఖాలు కనిపిస్తున్నా... బ్యాటింగ్ లైనప్ మాత్రం దాదాపుగా ప్రపంచకప్ ఆడే జట్టుగానే కనిపిస్తోంది. అయినా వరుసగా రెండు వన్డేల్లో ఘోరంగా ఓడిపోయారు.
ఇక ఇప్పుడు కోలుకోకపోతే... సిరీస్‌లో ఘోర పరాభవం తప్పదు. మరోవైపు ధోని లేకపోయినా కోహ్లి సారథ్యంలో యువ భారత్ కదం తొక్కుతూ మంచి ఉత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య మూడో వన్డే ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం జరగనుంది. వరుసగా రెండు వన్డేల్లో ఘన విజయం సాధించిన భారత్ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.
ఇద్దరే స్పిన్నర్లు
ఈ మ్యాచ్ కోసం భారత్ బ్యాటింగ్ విభాగంలో మార్పులేం చేయకపోవచ్చు. ఓపెనర్లు రహానే, ధావన్ ఫామ్‌లోనే ఉన్నారు. రెండో వన్డేలో ఫస్ట్‌డౌన్‌లోకి ప్రమోట్ అయి సెంచరీ చేసిన రాయుడిని ఈ మ్యాచ్‌లోనూ ముందుగా బ్యాటింగ్‌కు పంపుతారో లేదో చూడాలి. సొంతగడ్డపై తొలిసారి వన్డే ఆడబోతున్న రాయుడు... మరోసారి రెండో వన్డే తరహాలో ఆడితే ఇక కెరీర్ గురించి నిశ్చింతగా ఉండొచ్చు. ఇక కోహ్లి, రైనా కూడా ఫామ్‌లోనే ఉన్నారు. అయితే వికెట్ కీపర్ సాహాకు ఇప్పటివరకూ అవకాశం రాలేదు.
కాబట్టి సాహాను కూడా బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక బౌలింగ్ విభాగంలో మాత్రం భారత్ ఓ మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో వికెట్ స్వభావం దృష్ట్యా ముగ్గురు స్పిన్నర్లతో ఆడారు. కానీ హైదరాబాద్ వికెట్‌ను చూస్తే ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో ఆడే అవకాశం ఉంది. కాబట్టి అక్షర్ పటేల్, జడేజాలలో ఒకరు బెంచ్ మీద కూర్చోవాలి. ధావల్ కులకర్ణి, స్టువర్ట్ బిన్నీలలో ఒకరు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇషాంత్, ఉమేశ్ ఇద్దరూ మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తుండటం భారత్‌కు సానుకూలాంశం.
ఇప్పుడైనా కోలుకోవాలి
శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్లు దిల్షాన్, పెరీరాలతో పాటు సీనియర్ బ్యాట్స్‌మన్ జయవర్ధనే కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడటం లేదు. సంగక్కర, మాథ్యూస్ మాత్రం ఫర్వాలేదనిపిస్తున్నారు. సంగక్కర, జయవర్ధనేలలో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడితేనే జట్టు మంచి స్కోరు చేయగలుగుతుంది. ఆల్‌రౌండర్లు మాథ్యూస్, తిసార పెరీరా ఏ నిమిషంలో అయినా ఫలితాన్ని మార్చగల సమర్థులు. బౌలింగ్ విభాగంలో మాత్రం లంక శిబిరంలో గందరగోళం కొనసాగుతోంది. మలింగ, హెరాత్ లేకుండా భారత్‌కు రావడం వల్ల ఆ జట్టు ఈ విభాగంలో బాగా బలహీనంగా కనిపిస్తోంది. పేసర్ కులశేఖర ఈ మ్యాచ్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రహానే, ధావన్, రాయుడు, రైనా, సాహా, జడేజా / అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, అశ్విన్, ధావల్ / బిన్నీ
శ్రీలంక: మాథ్యూస్ (కెప్టెన్), దిల్షాన్, జయవర్ధనే, కుశాల్ పెరీరా, సంగక్కర, ప్రసన్న, ప్రియాంజన్, తిషార పెరీరా, ప్రసాద్, రణ్‌దీవ్ / కులశేఖర, గమగే.
పిచ్, వాతావరణం
ఆరంభంలో కొద్దిగా బౌన్స్ ఉన్నా... క్రమంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ పెద్దగా స్వభావం మారదు. మొత్తం మీద బ్యాటింగ్ వికెట్‌గానే చెప్పాలి. భారీస్కోరు ఆశించవచ్చు. సాధారణంగా హైదరాబాద్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉండకపోయినా, ఈ సారి కాస్త ప్రభావం చూపొచ్చు. వాతావరణం మ్యాచ్‌కు అడ్డంకి కాబోదు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
‘ప్రతీ మ్యాచ్‌ను మేం నాకౌట్ మ్యాచ్‌లాగే భావిస్తాం. ప్రపంచకప్‌కు ముందు వేర్వేరు వ్యూహాలపై దృష్టి పెట్టాం. కాబట్టి ప్రత్యర్థి బలహీనంగా ఉందనే చర్చ అనవసరం. మా బలం తెలుసుకోవడమే ముఖ్యం. అయినా... మా జట్టుకు అన్ని రకాల పరిస్థితుల్లో, అన్ని రకాల బౌలింగ్ అటాక్‌లను ఎదుర్కోగల సామర్థ్యం ఉంది. అయితే మరీ ఎక్కువ ప్రయోగాలు చేయడం కాకుండా బాగా ఆడగలిగే 11 మందిని ఎంచుకోవడం కోసమే ఈ ప్రయత్నమంతా.
సిరీస్‌లో ఆధిక్యం వచ్చినా మేం ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ఆడాలని, భారీ విజయాలు సాధించాలనేదే మా ఆలోచన. రాయుడులో ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. 50 ఓవర్ల పాటు ఆడి జట్టును గెలిపించగలడు. దానిని గుర్తించడమే మనం చేయాల్సింది. పదేళ్ల క్రితమే అతను ఇలాంటి ఇన్నింగ్స్ ఆడగలిగేవాడు. అందుకే అతను పరుగులు సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కడైనా రాయుడు బాగా ఆడగలడు. అతను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అవకాశం కల్పించాలి’ - విరాట్ కోహ్లి, భారత కెప్టెన్