సెరెనా అదరహో... | Wimbledon 2015: Serena Williams wins title to complete 'Serena Slam' | Sakshi
Sakshi News home page

సెరెనా అదరహో...

Published Sun, Jul 12 2015 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

సెరెనా అదరహో...

సెరెనా అదరహో...

అనుభవానికి ఉరకలెత్తే ఉత్సాహం తోడైంది. అంచనాలు మళ్లీ నిజమయ్యాయి. మహిళల టెన్నిస్‌లో మకుటంలేని మహారాణి తానేనంటూ అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ మరోసారి నిరూపించింది. ఆరోసారి వింబుల్డన్ విజేతగా నిలిచి అదరహో అనిపించింది.
 
 లండన్:
వయసు పెరుగుతున్నకొద్దీ మరింత మెరుగ్గా ఆడుతూ... మహిళల టెన్నిస్‌లో కొత్త శిఖరాలను అందుకుంటూ సెరెనా విలియమ్స్ ముందుకు సాగిపోతోంది. టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ... ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ గౌరవాన్ని పెంచుతూ... ఈ అమెరికా స్టార్ తన ఖాతాలో 21వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను జమ చేసుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సెరెనా 6-4, 6-4తో 20వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)పై గెలిచి ఆరోసారి వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచింది.
 
 
 గతంలో సెరెనా 2002, 2003, 2009, 2010, 2012లలో ఈ టైటిల్‌ను సాధించింది. గంటా 23 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ముగురుజా పోరాటం అందర్నీ ఆకట్టుకున్నా... తుదకు సెరెనా అనుభవమే పైచేయి సాధించింది. విజేతగా నిలిచిన సెరెనాకు 18 లక్షల 80 వేల పౌండ్లు (రూ. 18 కోట్ల 48 లక్షలు), రన్నరప్ ముగురుజాకు 9 లక్షల 40 వేల పౌండ్లు (రూ. 9 కోట్ల 24 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలి గేమ్‌లోనే సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసి సంచలన ఆరంభం చేసిన ముగురుజా తన సర్వీస్‌ను కాపాడుకొని 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
 
 తన సర్వీస్‌లను నిలబెట్టుకుంటేచాలు తొలి సెట్‌ను సొంతం చేసుకునే పరిస్థితిలో ముగురుజా తడబడింది. ఇక్కడే సెరెనా తన అపార అనుభవాన్ని ఉపయోగించింది. ఏడో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ అమెరికా స్టార్ స్కోరును 4-4తో సమం చేసింది. అదే జోరులో తన సర్వీస్‌ను కాపాడుకొని పదో గేమ్‌లో మరోసారి ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా తొలి సెట్‌ను 6-4తో దక్కించుకుంది. రెండో సెట్‌లోనూ సెరెనా తన హవా చెలాయించింది.
 
 చూస్తుండగానే వరుస గేమ్‌లను సాధించి 5-1తో ఆధిక్యంలోకి వచ్చేసింది. ఇక సెరెనా విజయం లాంఛనమే అనుకుంటున్న దశలో ముగురుజా అద్భుత ఆటతీరుతో పుంజుకుంది. రెండుసార్లు సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముగురుజా ఆధిక్యాన్ని 4-5కి తగ్గించింది. పదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొనిఉంటే ముగురుజా స్కోరును 5-5తో సమం చేసేది. అయితే సెరెనా దూకుడుగా ఆడి ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసి రెండో సెట్‌ను 6-4తో సొంతం చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది.
 ఈ ఏడాది ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 13 వరకు న్యూయార్క్‌లో జరిగే యూఎస్ ఓపెన్‌లో గనుక సెరెనా విజేతగా నిలిస్తే అరుదైన ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను పూర్తి చేస్తుంది. గతంలో మౌరిన్ కానెల్లీ (అమెరికా-1953లో), మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా-1970లో),  స్టెఫీగ్రాఫ్ (జర్మనీ- 1988లో) మాత్రమే ఒకే ఏడాదిలో 4 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించారు.
 
 
 స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ-1988లో) తర్వాత ఒకే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ సెరెనాయే.
 
 ఓవరాల్‌గా అత్యధిక సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టై టిల్స్ నెగ్గిన వారి జాబితాలో సెరెనా మూడో స్థానంలో (21) ఉంది. మార్గరెట్ కోర్ట్ (24), స్టెఫీగ్రాఫ్ (22) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
 
 ఓపెన్ శకంలో (1968 తర్వాత) పెద్ద వయస్సులో (33 ఏళ్ల 289 రోజులు) గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన క్రీడాకారిణిగా సెరెనా రికార్డు సృష్టించింది. మార్టినా నవ్రతిలోవా (33 ఏళ్ల 263 రోజులు-1990లో వింబుల్డన్) పేరిట ఉన్న రికార్డును సెరెనా బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా సెరెనా ఖాతాలో ఇది 34వ (సింగిల్స్‌లో 21, డబుల్స్‌లో 13) గ్రాండ్‌స్లామ్ టైటిల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement