నీరజ్‌... నంబర్‌వన్‌ | Neeraj Chopra world No. 1 in World Athletics mens javelin throw rankings | Sakshi
Sakshi News home page

నీరజ్‌... నంబర్‌వన్‌

Published Tue, May 23 2023 5:37 AM | Last Updated on Tue, May 23 2023 5:37 AM

Neeraj Chopra world No. 1 in World Athletics mens javelin throw rankings - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత అథ్లెటిక్స్‌ ముఖచిత్రంగా మారిన స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా తన కెరీర్‌లో మరో గొప్ప ఘనతను సాధించాడు. సోమవారం విడుదల చేసిన వరల్డ్‌ అథ్లెటిక్స్‌ పురుషుల జావెలిన్‌ త్రో ర్యాంకింగ్స్‌లో నీరజ్‌ చోప్రా ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. తద్వారా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌గా అవతరించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నీరజ్‌ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం నీరజ్‌ 1455 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉండగా... ప్రపంచ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా; 1433 పాయింట్లు) రెండో స్థానంలో, జాకుబ్‌ వాద్లెచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌; 1416 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు.

గత ఐదేళ్లుగా నీరజ్‌ అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం... 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణం... 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం... 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం... 2022 ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రజతం... 2022 డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో స్వర్ణం... ఇలా నీరజ్‌ అంతర్జాతీయ వేదికలపై పతకాల పంట పండిస్తున్నాడు. తాజా సీజన్‌లో భాగంగా ఈనెలలో దోహాలో జరిగిన డైమండ్‌ లీగ్‌ తొలి సిరీస్‌లో నీరజ్‌ అగ్రస్థానంలో నిలిచాడు. తదుపరి వచ్చే నెలలో ఫిన్‌లాండ్‌లో జరిగే పావో నుర్మీ గేమ్స్‌లో నీరజ్‌ బరిలోకి దిగనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement