world number one rank
-
నీరజ్... నంబర్‌వన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత అథ్లెటిక్స్ ముఖచిత్రంగా మారిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన కెరీర్లో మరో గొప్ప ఘనతను సాధించాడు. సోమవారం విడుదల చేసిన వరల్డ్ అథ్లెటిక్స్ పురుషుల జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో నీరజ్ చోప్రా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. తద్వారా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నీరజ్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం నీరజ్ 1455 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉండగా... ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 1433 పాయింట్లు) రెండో స్థానంలో, జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 1416 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. గత ఐదేళ్లుగా నీరజ్ అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం... 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణం... 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం... 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం... 2022 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం... 2022 డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో స్వర్ణం... ఇలా నీరజ్ అంతర్జాతీయ వేదికలపై పతకాల పంట పండిస్తున్నాడు. తాజా సీజన్లో భాగంగా ఈనెలలో దోహాలో జరిగిన డైమండ్ లీగ్ తొలి సిరీస్‌లో నీరజ్ అగ్రస్థానంలో నిలిచాడు. తదుపరి వచ్చే నెలలో ఫిన్లాండ్లో జరిగే పావో నుర్మీ గేమ్స్‌లో నీరజ్ బరిలోకి దిగనున్నాడు. -
జొకోవిచ్ ‘నంబర్‌వన్’ రికార్డు
దుబాయ్: టెన్నిస్ చరిత్రలో ఏ ప్లేయర్‌కూ సాధ్యంకాని ఘనతను సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ సొంతం చేసుకున్నాడు. 1973 నుంచి టెన్నిస్‌లో కంప్యూటర్ ర్యాంకింగ్స్ మొదలయ్యాక అత్యధిక వారాలు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) తాజా ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ 6,980 పాయింట్లతో తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. దాంతో ఈ సెర్బియా స్టార్ నంబర్‌వన్ ర్యాంక్ హోదాలో 378 వారాలు పూర్తి చేసుకోవడం ఖాయమైంది. ఇప్పటి వరకు ఈ రికార్డు జర్మనీ దిగ్గజం, మహిళా స్టార్ స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉంది. గ్రాఫ్ 377 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక వారాలు టాప్ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా 2021 మార్చిలోనే జొకోవిచ్ గుర్తింపు పొందాడు. స్విట్జర్లాండ్ మేటి రోజర్ ఫెడరర్ (310 వారాలు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ బద్దలు కొట్టాడు. తాజాగా అటు పురుషుల విభాగంలోగానీ, ఇటు మహిళల విభాగంలోగానీ అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా నిలిచిన ప్లేయర్‌గా ఈ సెర్బియా యోధుడు చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ‘మీరందరి ప్రేమాభిమానం కారణంగా నా కెరీర్లో ఎన్నో కొత్త ఘనతలు సాధించాను. తాజాగా అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా నిలిచిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని దుబాయ్ ఓపెన్‌లో పాల్గొనేందుకు వచ్చిన 35 ఏళ్ల జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ 2011 జూలై 4న 24 ఏళ్ల 43 రోజుల ప్రాయంలో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ అయ్యాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచిన 28 ప్లేయర్లలో ఒకడైన జొకోవిచ్ రికార్డుస్థాయిలో ఏడుసార్లు సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించాడు. అత్యధిక వారాలు అగ్రస్థానంలో నిలిచిన టాప్–5 ప్లేయర్లు 1. జొకోవిచ్: 378 వారాలు 2. స్టెఫీ గ్రాఫ్ : 377 వారాలు 3. మార్టినా నవ్రతిలోవా : 332 వారాలు 4. సెరెనా విలియమ్స్: 319 వారాలు 5. రోజర్ ఫెడరర్ : 310 వారాలు -
సంప్రాస్ సరసన జొకోవిచ్
పారిస్: ఈ ఏడాది అద్భుతంగా రాణించిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తన చిన్ననాటి ఆరాధ్య క్రీడాకారుడు పీట్ సంప్రాస్ సరసన నిలిచాడు. అత్యధికసార్లు పురుషుల టెన్నిస్ సీజన్‌ను ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించిన ప్లేయర్‌గా ఇన్నాళ్లూ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. గతంలో సంప్రాస్ 1993 నుంచి 1998 వరకు వరుసగా ఆరేళ్లపాటు సీజన్‌ను ప్రపంచ నంబర్‌వన్‌గా ముగించాడు. 33 ఏళ్ల జొకోవిచ్ 2011, 2012, 2014, 2015, 2018, 2020 సీజన్లను టాప్ ర్యాంక్‌తో ముగించి సంప్రాస్ సరసన చేరాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (20 చొప్పున) సాధించిన మేటి క్రీడాకారులు రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) గతంలో ఐదుసార్లు చొప్పున సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించారు. గతేడాది వరకు ఫెడరర్, నాదల్ సరసన నిలిచిన జొకోవిచ్ ఈ ఏడాది వారిద్దరిని వెనక్కి నెట్టి ముందుకు వెళ్లిపోయాడు. కరోనా వైరస్ కారణంగా కుదించిన ఈ టెన్నిస్ సీజన్లో జొకోవిచ్ మొత్తం 39 మ్యాచ్‌ల్లో గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయాడు. అంతేకాకుండా నాలుగు టైటిల్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ‘టెన్నిస్ రాకెట్ పట్టినప్పటి నుంచి సంప్రాస్‌ను ఆరాధించేవాణ్ని. ఇప్పుడు అతని రికార్డును సమం చేసినందుకు నా కల నిజమైంది’ అని జొకోవిచ్ అన్నాడు. కెరీర్లో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్ గత సెప్టెంబర్‌లో అత్యధిక వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితాలో సంప్రాస్ (286 వారాలు)ను మూడో స్థానానికి నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటికే 294 వారాలు టాప్ ర్యాంక్‌లో ఉన్న జొకోవిచ్ వచ్చే సీజన్లోనూ నిలకడగా ఆడితే మార్చి తొలి వారంలో... అత్యధిక వారాలు నంబర్‌వన్ స్థానంలో ఉన్న ప్లేయర్ ఫెడరర్ (310 వారాలు) రికార్డును కూడా బద్దలు కొడతాడు. నవంబర్ 15న లండన్‌లో మొదలయ్యే సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో జొకోవిచ్ బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీ సందర్భంగా సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించినందుకు అతనికి అధికారిక ట్రోఫీని ప్రదానం చేస్తారు. -
ముర్రే.. హిప్ హిప్ హుర్రే..!
బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్లో తొలిసారి నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్‌గా అవతరించాడు. పారిస్ మాస్టర్స్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ద్వారా అతడు ఈ ఘనత వహించగా.. అధికారికంగా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య తాజా ర్యాంకులలో ముర్రే టాప్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. 122 వారాల పాటు ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న జొకోవిచ్ రెండో ర్యాంకుకు పడిపోయాడు. ముర్రే ఖాతాలో 11,185 పాయింట్లుండగా, జొకోవిచ్ ఖాతాలో 10,780 పాయింట్లు ఉన్నాయి. స్విట్జర్లాండ్ ప్లేయర్ స్టాన్ వావ్రింకా మూడో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఇప్పటివరకూ నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన సెర్బియా యోధుడు నొవాక్ జోకొవిచ్ ఈ టోర్నీలో క్వార్టర్స్ లో ఓడిపోవడం ముర్రేకు కలిసొచ్చింది. ఈ ఏడాది ఒలింపిక్స్ స్వర్ణంతో పాటు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. లండన్ ఒలింపిక్స్ లోనూ స్వర్ణం నెగ్గిన ముర్రే.. వరుసగా సింగిల్స్ లో రెండు స్వర్ణాలు నెగ్గిన టెన్నిస్ ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. -
సెరెనా అదరహో...
అనుభవానికి ఉరకలెత్తే ఉత్సాహం తోడైంది. అంచనాలు మళ్లీ నిజమయ్యాయి. మహిళల టెన్నిస్‌లో మకుటంలేని మహారాణి తానేనంటూ అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ మరోసారి నిరూపించింది. ఆరోసారి వింబుల్డన్ విజేతగా నిలిచి అదరహో అనిపించింది. లండన్: వయసు పెరుగుతున్నకొద్దీ మరింత మెరుగ్గా ఆడుతూ... మహిళల టెన్నిస్‌లో కొత్త శిఖరాలను అందుకుంటూ సెరెనా విలియమ్స్ ముందుకు సాగిపోతోంది. టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ... ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ గౌరవాన్ని పెంచుతూ... ఈ అమెరికా స్టార్ తన ఖాతాలో 21వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను జమ చేసుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సెరెనా 6-4, 6-4తో 20వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)పై గెలిచి ఆరోసారి వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచింది. గతంలో సెరెనా 2002, 2003, 2009, 2010, 2012లలో ఈ టైటిల్‌ను సాధించింది. గంటా 23 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ముగురుజా పోరాటం అందర్నీ ఆకట్టుకున్నా... తుదకు సెరెనా అనుభవమే పైచేయి సాధించింది. విజేతగా నిలిచిన సెరెనాకు 18 లక్షల 80 వేల పౌండ్లు (రూ. 18 కోట్ల 48 లక్షలు), రన్నరప్ ముగురుజాకు 9 లక్షల 40 వేల పౌండ్లు (రూ. 9 కోట్ల 24 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలి గేమ్‌లోనే సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసి సంచలన ఆరంభం చేసిన ముగురుజా తన సర్వీస్‌ను కాపాడుకొని 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తన సర్వీస్‌లను నిలబెట్టుకుంటేచాలు తొలి సెట్‌ను సొంతం చేసుకునే పరిస్థితిలో ముగురుజా తడబడింది. ఇక్కడే సెరెనా తన అపార అనుభవాన్ని ఉపయోగించింది. ఏడో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ అమెరికా స్టార్ స్కోరును 4-4తో సమం చేసింది. అదే జోరులో తన సర్వీస్‌ను కాపాడుకొని పదో గేమ్‌లో మరోసారి ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా తొలి సెట్‌ను 6-4తో దక్కించుకుంది. రెండో సెట్లోనూ సెరెనా తన హవా చెలాయించింది. చూస్తుండగానే వరుస గేమ్‌లను సాధించి 5-1తో ఆధిక్యంలోకి వచ్చేసింది. ఇక సెరెనా విజయం లాంఛనమే అనుకుంటున్న దశలో ముగురుజా అద్భుత ఆటతీరుతో పుంజుకుంది. రెండుసార్లు సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముగురుజా ఆధిక్యాన్ని 4-5కి తగ్గించింది. పదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొనిఉంటే ముగురుజా స్కోరును 5-5తో సమం చేసేది. అయితే సెరెనా దూకుడుగా ఆడి ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసి రెండో సెట్‌ను 6-4తో సొంతం చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 13 వరకు న్యూయార్క్‌లో జరిగే యూఎస్ ఓపెన్‌లో గనుక సెరెనా విజేతగా నిలిస్తే అరుదైన ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను పూర్తి చేస్తుంది. గతంలో మౌరిన్ కానెల్లీ (అమెరికా-1953లో), మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా-1970లో), స్టెఫీగ్రాఫ్ (జర్మనీ- 1988లో) మాత్రమే ఒకే ఏడాదిలో 4 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించారు. స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ-1988లో) తర్వాత ఒకే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ సెరెనాయే. ఓవరాల్‌గా అత్యధిక సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టై టిల్స్ నెగ్గిన వారి జాబితాలో సెరెనా మూడో స్థానంలో (21) ఉంది. మార్గరెట్ కోర్ట్ (24), స్టెఫీగ్రాఫ్ (22) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఓపెన్ శకంలో (1968 తర్వాత) పెద్ద వయస్సులో (33 ఏళ్ల 289 రోజులు) గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన క్రీడాకారిణిగా సెరెనా రికార్డు సృష్టించింది. మార్టినా నవ్రతిలోవా (33 ఏళ్ల 263 రోజులు-1990లో వింబుల్డన్) పేరిట ఉన్న రికార్డును సెరెనా బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా సెరెనా ఖాతాలో ఇది 34వ (సింగిల్స్‌లో 21, డబుల్స్‌లో 13) గ్రాండ్‌స్లామ్ టైటిల్. -
సైనా.. వరల్డ్ నంబర్ 1
-
బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆదిత్య జోషి సంచలనం
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆదిత్య జోషి సంచలనం సృష్టించాడు. జూనియర్ బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్న తొలి భారత ఆటగాడిగా నిలిచాడు ఆదిత్య. గతేడాది నవంబర్‌లో 11వ స్థానంలో ఉన్న ఆదిత్య.. జనవరిలో ఏకంగా పది స్థానాలు ఎగబాకడం విశేషం. 2001లో ఐదేళ్ల వయసులో బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టిన ఆదిత్య.. అప్పటి నుంచే సంచలనాలు సృష్టించడం మొదలుపెట్టాడు. 2011లో రష్యాలో జరిగిన జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నీలో గోల్డ్‌మెడల్ సాధించాడు. గతేడాది జూనియర్ వాల్డ్ చాంపియన్‌షిప్‌తో పాటు ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ఫైనల్ వరకూ వచ్చాడు. గతేడాది నేషనల్ చాంపియన్ అయిన ఆదిత్య.. పుణెలో జరిగిన జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నీలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించాడు.