సెరెనా @ 300 | Wimbledon: Serena Williams reaches 300-win milestone in Annika Beck romp | Sakshi
Sakshi News home page

సెరెనా @ 300

Published Mon, Jul 4 2016 2:26 AM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

సెరెనా @ 300

సెరెనా @ 300

ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్... వింబుల్డన్‌లో ప్రిక్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది.

* వింబుల్డన్ ప్రిక్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్
* సోంగా, గ్యాస్కెట్, బెర్డిచ్ కూడా...  

లండన్: ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్... వింబుల్డన్‌లో ప్రిక్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో టాప్‌సీడ్ సెరెనా 6-3, 6-0తో అన్‌సీడెడ్ అన్నికా బేక్ (జర్మనీ)పై గెలిచింది. దీంతో గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 300వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఫలితంగా అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో రెండో స్థానానికి ఎగబాకింది. ఓపెన్ ఎరాలో మార్టినా నవ్రోతిలోవా (అమెరికా) 306 విజయాలతో ‘టాప్’లో కొనసాగుతోంది.

34 ఏళ్ల సెరెనాకు వింబుల్డన్‌లో ఇది 82వ విజయం కాగా, ఏడో టైటిల్ కోసం బరిలోకి దిగిన ఆమె... స్టెఫీ గ్రాఫ్ 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డును సమం చేసేందుకు ప్రయత్నిస్తోంది. బెక్‌తో 51 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... అమెరికా స్టార్ పదునైన సర్వీస్‌లు.. బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో విరుచుకుపడింది. దాదాపు 198 కేఎంపీహెచ్ వేగంతో సంధించిన ఏడు ఏస్‌లకు ప్రత్యర్థి వద్ద సమాధానం లేకపోయింది. మ్యాచ్ మొత్తంలో 25 విన్నర్లు సాధించింది. మరోవైపు 22 ఏళ్ల బేక్.. వింబుల్డన్‌లో మూడోరౌండ్‌కు చేరడం ఇదే తొలిసారి.

ఇతర మ్యాచ్‌ల్లో 13వ సీడ్ కుజ్‌నెత్సోవా (రష్యా) 6-7 (1), 6-2, 8-6తో 18వ సీడ్ సోలెనీ (అమెరికా)పై; 21వ సీడ్ పావులెంచుకోవా (రష్యా) 6-3, 6-2తో 11వ సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై; 27వ సీడ్ వాండ్‌వాగె (అమెరికా) 6-3, 6-4తో ఆరోసీడ్ విన్సీ (ఇటలీ)పై; మకరోవా (రష్యా) 6-4, 6-2తో 24వ సీడ్ స్ట్రయికోవా (చెక్)పై; వెస్నినా (రష్యా) 7-5, 7-5తో బొసెరుప్ (అమెరికా)పై నెగ్గి తదుపరి రౌండ్‌కు చేరారు.
 
డెల్‌పోట్రోకు చుక్కెదురు
పురుషుల సింగిల్స్‌లో డెల్‌పోట్రో (అర్జెంటీనా)కు చుక్కెదురైంది. మూడోరౌండ్‌లో 32వ సీడ్ లుకాస్ ఫౌలి (ఫ్రాన్స్) 6-7 (4), 7-6 (6), 7-5, 6-1తో డెల్‌పోట్రోపై నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఏడోసీడ్ గ్యాస్కెట్ (ఫ్రాన్స్) 2-6, 7-6 (5), 6-2, 6-3తో వినోలాస్ (స్పెయిన్)పై; 10వ సీడ్ బెర్డిచ్ (చెక్) 6-3, 6-4, 4-6, 6-1తో జ్వరేవ్ (జర్మనీ)పై; 12వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-7 (3), 3-6, 7-6 (5), 6-2, 19-17తో 18వ సీడ్ ఇస్నేర్ (అమెరికా)పై; 15వ సీడ్ కిర్గియోస్ (ఆస్ట్రేలియా) 6-3, 6-7 (2), 6-3, 6-4తో 22వ సీడ్ లోపెజ్ (స్పెయిన్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.
 
ప్రిక్వార్టర్స్‌లో సానియా జోడి
మహిళల డబుల్స్ రెండోరౌండ్‌లో భారత స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి 6-3, 6-1తో ఎరి హౌజుమి-మియు కాటో (జపాన్)జంటపై నెగ్గి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. 52 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... సానియా ద్వయం ఎనిమిది బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఐదింటిని సద్వినియోగం చేసుకుంది.  

పురుషుల డబుల్స్‌లో రెండో రౌండ్‌లో లియాండర్ పేస్ (భారత్)- మార్సిన్‌మత్‌కోవాస్కీ (పోలాండ్) జోడి 3-6, 2-6తో 10వ సీడ్ హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్)-జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది. తొలిసెట్‌లో వచ్చిన మూడు బ్రేక్ పాయింట్ అవకాశాల్లో పేస్ ద్వయం ఒక్కటి కూడా సద్వినియోగం చేసుకోలేదు. మ్యాచ్ మొత్తంలో మూడుసార్లు సర్వీస్‌ను కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది.
 
నాలుగోసారి..
వర్షం కారణంగా ఈసారి వింబుల్డన్‌లో ఆదివారం కూడా మ్యాచ్‌లు నిర్వహించారు. ఇలా చేయడం టోర్నీ చరిత్రలో ఇది నాలుగోసారి కాగా, 2004 తర్వాత మొదటిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement