‘ఒక్కటే’ లక్ష్యం
కివీస్‌తో సిరీస్ కీలకం
రోహిత్ శర్మ వ్యాఖ్య
ముంబై: ప్రస్తుత సీజన్‌లో భారత జట్టు సరైన దిశలో సాగుతోందని స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అన్నాడు. ‘మా లక్ష్యం నంబర్‌వన్. ఇటీవల అగ్రస్థానంలో ఉన్నప్పటికీ రోజుల వ్యవధిలోనే చేజార్చుకున్నాం. మళ్లీ ఈ సీజన్‌లో సాధిస్తాం’ అని రోహిత్ చెప్పాడు. ముంబై స్పోర్‌ట్స జర్నలిస్టుల సంఘం స్వర్ణోత్సవ వేడుక అవార్డుల కార్యక్రమానికి రోహిత్‌తో పాటు అజింక్యా రహానే, మాజీ బౌలర్ జహీర్‌ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ‘వెస్టిండీస్‌తో చివరి టెస్టు వర్షం వల్ల జరగకపోవడం వల్లే టెస్టు ర్యాంకింగ్‌సలో నంబర్‌వన్ స్థానాన్ని కోల్పోయాం. ఏకంగా 13 టెస్టులు జరగనున్న ఈ సీజన్‌లో రాణించి టాప్ ర్యాంకుకు చేరుకుంటాం.
ముందుగా న్యూజిలాండ్ సిరీస్‌నుంచే మా జైత్రయాత్ర ప్రారంభిస్తాం’ అని అన్నాడు. రహానే మాట్లాడుతూ కివీస్‌తో త్వరలో జరిగే సిరీస్ కీలకమైందని. దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పాడు. తదుపరి జరిగే టెస్టులన్నీ స్వదేశంలోనే ఉండటంతో ఈ సీజన్ మొత్తం ముఖ్యమైందని అన్నాడు. జహీర్ మాట్లాడుతూ ‘ఇలాంటి పెద్ద సీజన్‌తో క్రికెటర్ల టెస్టు కెరీర్ గ్రాఫ్ అమాంతం మారుతుంది. గెలిచినా... ఓడినా... ఫలితమేదైనా కానివ్వండి... ఆటగాళ్ల కెరీర్‌కు ఇది మేలే చేస్తుంది’ అని అన్నాడు. ఆశావహ దృక్పథంలో సీజన్‌ను మొదలు పెట్టాలని అతను సూచించాడు.