రికార్డు టైటిల్ పై గురి
♦ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ నేడు
♦ వెస్టిండీస్‌తో భారత్ అమీతుమీ
మిర్‌పూర్: ప్రస్తుత అండర్-19 ప్రపంచకప్‌లో ఒక్క పరాజయం కూడా లేకుండా దూసుకెళుతున్న యువ భారత్ రికార్డు స్థాయిలో నాలుగో టైటిల్‌ను గెలుచుకునేందుకు సిద్ధమవుతోంది. నేడు (ఆదివారం) స్థానిక షేరె బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత జట్టు వెస్టిండీస్‌ను ఢీకొంటుంది. చివరిసారి 2012లో ఉన్ముక్త్ చంద్ నేతృత్వంలోని భారత జట్టు ఈ టైటిల్ సాధించింది. అంతకుముందు 2000, 2008లోనూ కప్ గెలుచుకోగా ఈసారి కూడా చాంపియన్‌గా నిలిస్తే తొలిసారిగా ఈ టోర్నీని నాలుగుసార్లు గెలిచిన జట్టుగా రికార్డులకెక్కుతుంది.
ప్రస్తుతం ఆసీస్ (3)తో సమంగా ఉంది. ఇప్పటిదాకా ఈ టోర్నీలో జరిగిన మ్యాచ్‌ల్లో కుర్రాళ్లు స్పష్టమైన ఆధిక్యంతో విజయాలు సాధించారు. ఆరంభంలో వికెట్లు త్వరగా పడినా కనీసం ఇద్దరు బ్యాట్స్‌మెన్ అయినా క్రీజులో నిలిచి అద్భుతమైన విజయాలను అందిస్తూ వచ్చారు. అయితే ఇప్పటిదాకా ఆడిన మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ చివరి మ్యాచ్‌ను ఎలాంటి అలక్ష్యానికి తావీయకుండా ముగించాల్సిన అవసరం ఉంది. మరోవైపు తమ సీనియర్ జట్టు పేలవ ప్రదర్శనతో పాతాళానికి దిగజారుతున్న నేపథ్యంలో భవిష్యత్‌పై ఆశలు కల్పిస్తూ వెస్టిండీస్ కుర్రాళ్లు ఈ టోర్నీలో సత్తా చాటారు. పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన ఈ జట్టును తక్కువ అంచనా వేయకూడదు.
కెప్టెన్ ఫామ్ ఆందోళనకరం
ఈ టోర్నీలో భారత్ అన్ని మ్యాచ్‌లను గెలిచినప్పటికీ కెప్టెన్ ఇషాన్ కిషన్ భాగస్వామ్యం దాదాపు శూన్యమే. ఐదు ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. కీలక ఫైనల్లో తన బ్యాట్‌ను ఝుళిపించి బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఫామ్ జట్టుకు రక్షగా ఉంది. రికీ భుయ్ స్థానంలో జట్టులోకి వచ్చిన అన్‌మోల్ ప్రీత్ సింగ్ సెమీస్‌లో లంకపై 72 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. పేసర్ అవేశ్ ఖాన్ ఇప్పటికే 11 వికెట్లతో రెచ్చిపోగా స్పిన్నర్ మయాంక్ దాగర్ ఆకట్టుకుంటున్నాడు. మరోసారి అంతా సమష్టిగా రాణిస్తే టైటిల్ గెలవచ్చు.
బ్యాటింగ్ పటిష్టం
టోర్నీ చరిత్రలో రెండోసారి ఫైనల్‌కు చేరిన విండీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసేందుకు భారత బౌలర్లు శ్రమించాల్సిందే. ముఖ్యంగా ఆల్‌రౌండర్ షమర్ స్ప్రింజర్ అత్యంత ప్రమాదకర ఆటగాడు. సెమీస్‌లో తమ జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. అలాగే ఓపెనర్ గిడ్రోన్ పోప్, హెట్‌మైర్ కుదురుకుంటే భారత్ చెమటోడ్చాల్సిందే. ఇక బౌలింగ్‌లో జోసెఫ్, హోల్డర్ తొలి పది ఓవర్లు చక్కటి పేస్, బౌన్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్నారు. ఓవరాల్‌గా భారత్‌కు ఫైనల్లో గట్టి పోటీనే ఎదురుకావచ్చు.
జట్లు: (అంచనా)
భారత్: కిషన్ (కెప్టెన్), పంత్, అన్‌మోల్, సర్ఫరాజ్, సుందర్, అర్మాన్, లొమ్రోర్, దాగర్, బాథమ్, అవేశ్, అహ్మద్.
విండీస్: హెట్‌మైర్ (కెప్టెన్), పోప్, ఇమ్లాచ్, కర్టీ, స్ప్రింజర్, గూలీ, పాల్, ఫ్రూ, జాన్, జోసెఫ్, హోల్డర్.
పిచ్, వాతావరణం
ఉదయం కొద్దిసేపు పేసర్లకు అనుకూలించొచ్చు. ఆ తర్వాత స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
స్టార్ స్పోర్ట్స్2లో ఉ.8.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం