స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్దులు ఆటపట్టిస్తున్న ఉమాదేవి
ఏలూరు రూరల్: ఆమె బౌలింగ్ ప్రారంభిస్తే ప్రత్యర్థులకు హడలే. బాల్ గింగిరాలు తిరుగుతూ వస్తుంటే ఎంతటి బ్యాట్స్‌ఉమెన్ అయినా చిత్తు కావల్సిందే. ఆమే దేవరపల్లికి చెందిన మహిళా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ టి.ఉమాదేవి. ఆరేళ్లగా క్రికెట్ సాధన చేస్తున్న ఈమె ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపిస్తోంది. దేవరపల్లి డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతున్న ఈమె ఆంధ్ర మహిళ కుంబ్లేగా అందరిచే కితాబు అందుకుంటోంది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఈమె నిరంతర సాధన చేసి క్రికెట్‌లో అంచెలంచెలుగా ఎదుగుతోంది.
తోటి క్రీడాకారిణిల్లో స్ఫూర్తి నింపుతోంది. ఈనెల 4వ తేదీ నుంచి 13 వరకూ గుంటూరులో ఏసీఓ మహిళ అకాడమీలో అండర్–19 జోనల్‌స్థాయి మ్యాచ్‌లు జరిగాయి. ఈ పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఉమాదేవి నార్త్‌జోన్ జట్టును తన బౌలింగ్ ప్రతిభతో కుప్పకూల్చింది. 4 వికెట్లు తీసి జిల్లా జట్టును విజయపథంలో నడిపించింది. త్వరలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. ఇప్పటికే జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్ పోటీల్లో పాల్గొంది. మూడేళ్లుగా అండర్–16, 19 పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. నేడు అండర్–19లో కేరళ, తమిళనాడు, గోవా, కర్ణాటక, హైదరాబాద్ తదితర జట్లతో తలపడి జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిలో పడేందుకు కృషి చేస్తోంది.
ఈమె ప్రతిభను గుర్తించిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రామరాజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా నెలకు రూ.4 వేలు ఉపకార వేతనం అందిస్తున్నారు. సహాయ కార్యదర్శులు ఎం. వగేష్‌కుమార్ ఉమాదేవికి సహకారం అందిస్తున్నారు. కోచ్ ఎస్. రమాదేవి వద్ద శిక్షణ పొందుతున్న ఈమె తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, రత్నకుమారి వ్యవసాయం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment