
‘మ్యాక్స్’ బాదుడు
51 బంతుల్లోనే శతకం
ప్రపంచకప్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ
లంకపై ఆసీస్ ఘన విజయం
సంగక్కర సెంచరీ వృథా
క్వార్టర్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా
ప్రత్యర్థి అంచనాలకు భిన్నంగా కొట్టడం ఒక రకమైతే... ప్రత్యర్థి వ్యూహాల్లోకి చొచ్చుకొని పోయి చావ బాదడం రెండో రకం... చాలా మంది క్రికెటర్లు మొదటి రకానికి చెందితే.... మ్యాక్స్‌వెల్ మాత్రం రెండో దాన్ని పాటిస్తాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో కూడా మ్యాక్స్ అదే తరహాలో ఆడాడు... అవుటవుతాడనుకున్న బంతిని సునాయాసంగా బాదాడు.. బౌండరీల స్థానంలో సిక్సర్ల రుచి చూపాడు.. ప్రత్యర్థి కెప్టెన్‌కు ఆలోచన రాకుండా.. బౌలర్‌కు పెద్ద శ్రమ లేకుండా... బంతులను రాకెట్ వేగంతో మైదానం మొత్తం ‘మ్యాక్సిమమ్’ పరుగులు పెట్టించాడు.. దీంతో ప్రపంచకప్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టి ఆసీస్‌కు ఘన విజయాన్ని అందించాడు. సంగక్కర ధీరత్వం చూపినా.. చండిమల్ మెరుపులు మెరిపించినా... గెలుపు రేసులో లంక వెనుకబడిపోయింది.
సిడ్నీ: వీరోచిత బ్యాటింగ్‌తో చెలరేగిపోతున్న ఆస్ట్రేలియా... ప్రపంచకప్‌లో మరోసారి పరుగుల వరద పారించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (53 బంతుల్లో 102; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రపంచకప్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీతోకి తోడు... స్టీవెన్ స్మిత్ (88 బంతుల్లో 72; 7 ఫోర్లు, 1 సిక్స్) దుమ్మురేపడంతో ఆదివారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో క్లార్క్‌సేన 64 పరుగుల తేడాతో లంకపై ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో కంగారూ జట్టు క్వార్టర్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
సిడ్నీ క్రికెట్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 376 పరుగులు చేసింది. కెప్టెన్ క్లార్క్ (68 బంతుల్లో 68; 6 ఫోర్లు), వాట్సన్ (41 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. శ్రీలంక 46.2 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. సంగక్కర (107 బంతుల్లో 104; 11 ఫోర్లు) ఈ టోర్నీలో వరుసగా మూడో శతకం చేయగా...దిల్షాన్ (60 బంతుల్లో 62; 8 ఫోర్లు), చండిమల్ (24 బంతుల్లో 52 రిటైర్డ్‌హర్ట్; 8 ఫోర్లు, 1 సిక్స్), మ్యాథ్యూస్ (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
సమష్టిగా చెలరేగి...
ఆరంభంలో లంక బౌలర్ల నిలకడకు ఆసీస్ 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్మిత్, క్లార్క్ సమయోచితంగా రాణించి మూడో వికెట్‌కు 134 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ అవుటయ్యాక ఆసీస్ బ్యాటింగ్ పవర్‌ప్లే తీసుకుంది. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన మ్యాక్స్‌వెల్ లంక బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. దిల్షాన్, ప్రసన్న, పెరీరా బౌలింగ్‌లో భారీ సిక్సర్లు కొట్టిన మ్యాక్స్‌వెల్ 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
తర్వాత మలింగ ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్డాడు. అయితే 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ అవుట్ ప్రమాదం నుంచి బయటపడ్డ మ్యాక్స్... పెరీరా ఓవర్‌లో మరో రెండు భారీ సిక్సర్లు బాదాడు. మళ్లీ 93 పరుగుల వద్ద మరోసారి క్యాచ్ మిస్ కావడంతో బయటపడ్డ మ్యాక్స్... 51 బంతుల్లో కెరీర్‌లో తొలి శతకం పూర్తి చేశాడు. వాట్సన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 160 పరుగులు జోడించిన తర్వాత మ్యాక్స్ అవుటయ్యాడు. హాడిన్ (9 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడటంతో ఆసీస్ 350 పరుగులు దాటింది.
పోరాడిన శ్రీలంక
లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక ఐదు పరుగుల వద్ద తిరిమన్నే (1) వికెట్‌ను కోల్పోయింది. కానీ దిల్షాన్, సంగక్కర కలిసి ఆసీస్ బౌలర్లను హడలెత్తించారు. జాన్సన్ వేసిన ఆరో ఓవర్‌లో దిల్షాన్ వరుసగా ఆరు ఫోర్లు కొట్టాడు. ఈ ఇద్దరు బౌండరీల జోరు పెంచడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది.
46 పరుగుల వద్ద తన క్యాచ్‌ను క్లార్క్ డ్రాప్ చేయడంతో దిల్షాన్ కాస్త నెమ్మదించినా ...సంగ మాత్రం వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో సంగక్కర 45 బంతుల్లో; దిల్షాన్ 42 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు. చివరకు నిలకడగా ఆడుతున్న ఈ జోడిని 22వ ఓవర్‌లో ఫాల్క్‌నర్ విడగొట్టాడు. దిల్షాన్‌ను ఎల్బీ చేయడంతో రెండో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 30వ ఓవర్‌లోనే లంక బ్యాటింగ్ పవర్‌ప్లే తీసుకుంది. అయితే జయవర్ధనే (19) విఫలమైనా.. సంగ మాత్రం ఫాల్క్‌నర్ ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టి వంద బంతుల్లో శతకాన్ని సాధించాడు.
తర్వాత మ్యాథ్యూస్, చండిమల్... మైదానంలో ఉన్నంతసేపు ఆసీస్‌కు ముచ్చెమటలు పట్టించారు. 15 ఓవర్లలో 169 పరుగులు చేయాల్సిన దశలో చండిమల్ వీరబాదుడు బాదాడు. వాట్సన్, డోహెర్టీ ఓవర్లలో వరుసగా 16, 19 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 22 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన చండిమల్ 42వ ఓవర్‌లో కండర గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. తర్వాత రెండు బంతులకే మ్యాథ్యూస్ అవుట్‌కావడంతో లంక పతనం ఆరంభమైంది. చివరకు 31 పరుగుల తేడాతో ఆఖరి ఐదు వికెట్లు చేజార్చుకుని ఓటమిపాలైంది. ఫాల్క్‌నర్ 3 వికెట్లు తీశాడు. మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
51 మ్యాక్స్‌వెల్ శతకం కోసం తీసుకున్న బంతుల సంఖ్య. ప్రపంచకప్‌లో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో ఇదే వేగవంతమైన శతకం.
2 సచిన్ టెండూల్కర్ తర్వాత వన్డేల్లో 14 వేల పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్ సంగక్కర.
1 ప్రపంచకప్‌లో వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్ సంగక్కర.
టెస్టులకూ సంగక్కర గుడ్‌బై
సిడ్నీ: శ్రీలంక వెటరన్ బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ ఆగస్టులో గుడ్‌బై చెప్పనున్నాడు. భారత్‌తో జరిగే టెస్టు సిరీస్ అనంతరం 37 ఏళ్ల సంగ టెస్టులకూ వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆడుతున్న తను ఈ టోర్నీ ముగిశాక వన్డేల నుంచి తప్పుకోనున్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్ గెలుచుకున్న అనంతరం పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ‘జూన్, జూలైలో కూడా మా జట్టుకు టెస్టు మ్యాచ్‌లు ఉన్నాయి. నేను ఆగస్టు చివర్లో కెరీర్‌కు వీడ్కోలు పలకాలనుకుంటున్నాను’ అని సంగక్కర చెప్పాడు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (స్టంప్డ్) సంగక్కర (బి) ప్రసన్న 24; వార్నర్ (సి) ప్రసన్న (బి) మలింగ 9; స్మిత్ (సి) పెరీరా (బి) దిల్షాన్ 72; క్లార్క్ (బి) మలింగ 68; మ్యాక్స్‌వెల్ (సి) మలింగ (బి) పెరీరా 102; వాట్సన్ (సి) చండిమల్ (బి) పెరీరా 67; ఫాల్క్‌నర్ రనౌట్ 0; హాడిన్ (సి) పెరీరా (బి) మ్యాథ్యూస్ 25; జాన్సన్ నాటౌట్ 3; స్టార్క్ రనౌట్ 0; డోహెర్టీ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 376. వికెట్ల పతనం: 1-19; 2-41; 3-175; 4-177; 5-337; 6-338; 7-368; 8-373; 9-374.; బౌలింగ్: మలింగ 10-0-59-2; సేననాయకే 9-0-59-0; మ్యాథ్యూస్ 7-0-59-1; ప్రసన్న 10-0-77-1; పెరీరా 9-0-87-2; దిల్షాన్ 5-0-33-1. శ్రీలంక ఇన్నింగ్స్: తిరిమన్నే (సి) హాడిన్ (బి) జాన్సన్ 1; దిల్షాన్ ఎల్బీడబ్ల్యు (బి) ఫాల్క్‌నర్ 62; సంగక్కర (సి) ఫించ్ (బి) ఫాల్క్‌నర్ 104; జయవర్ధనే రనౌట్ 19; మ్యాథ్యూస్ (సి) హాడిన్ (బి) వాట్సన్ 35; చండిమల్ రిటైర్డ్‌హర్ట్ 52; పెరీరా (సి) డోహెర్టీ (బి) జాన్సన్ 8; తరంగ (సి) వార్నర్ (బి) ఫాల్క్‌నర్ 4; ప్రసన్న (బి) స్టార్క్ 9; సేననాయకే (సి) డోహెర్టీ (బి) స్టార్క్ 7; మలింగ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: (46.2 ఓవర్లలో ఆలౌట్) 312. వికెట్ల పతనం: 1-5; 2-135; 3-188; 4-201; 4-208 (చండిమల్ రిటైర్డ్); 5-283; 6-293; 7-305; 8-307; 9-312. బౌలింగ్: స్టార్క్ 8.2-0-29-2; జాన్సన్ 9-0-62-2; వాట్సన్ 7-0-71-1; డోహెర్టీ 7-0-60-0; మ్యాక్స్‌వెల్ 6-0-35-0; ఫాల్క్‌నర్ 9-0-48-3.