లండన్: ఎన్నో ఆశలు.. అంతకుమించి అంచనాలతో ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికాకు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. డుప్లెసిస్ సేన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాభావం మరిచిపోకముందే బంగ్లా చేతిలో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలవాలని ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన బంగ్లా తొలి మ్యాచ్‌లోనే సఫారీ జట్టును బొల్తా కొట్టించి ఆగ్రశ్రేణిజట్లకు హెచ్చరికలు జారీ చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్(42: 30 బంతుల్లో 9 ఫోర్లు), షకీబుల్ హసన్(75: 84 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), ముష్పికర్ రహీమ్(78: 80 బంతుల్లో 8 ఫోర్లు), మహ్మదుల్లా(46 నాటౌట్: 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించడంతో బంగ్లాదేశ్ ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సఫారీ బౌలర్లలో మోరిస్, తాహీర్, ఫెహ్లుకోవియా తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం బంగ్లా నిర్దేశించిన 331 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 309 పరుగులకే పరిమితమైంది. దీంతో ప్రపంచకప్‌లో వరుసగా రెండో ఓటమిని రెండో ఖాతాలో పడింది. ఆది నుంచి ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వని బంగ్లా బౌలర్లు సఫారీ ఆటగాళ్లను కట్టడి చేశారు. వీలుచిక్కినప్పుడల్లా వికెట్లు తీస్తు ఒత్తిడి పెంచారు. అయితే సఫారీ ఆటగాళ్లలో డుప్లెసిస్(62) అర్దసెంచరీతో రాణించాడు. మక్రామ్(45), డసన్(41), డుమినీ(45)లు విజయానికి కావాల్సిన పరుగులు సాధించడంలో విఫలమవ్వడంతో ఓటమి తప్పలేదు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ మూడు వికెట్లతో రాణించగా, సైఫుద్దీన్ రెండు వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment