లీడ్స్ : ఆతిథ్య ఇంగ్లండ్‌కు శ్రీలంక దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు బ్యాటింగ్‌లో పరుగుల ప్రవాహం సృష్టించిన మోర్గాన్ సేన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక 20 పరుగులు తేడాతో అధ్బుతమైన విజయాన్ని సాధించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లంక ఆల్‌రౌండ్ షోతో ఆతిథ్య జట్టును కంగుతినిపించింది. ఈ మ్యాచ్‌లో యార్కర్ల కింగ్ లసిత్ మలింగ(4/43) ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. మలింగకు తోడు డిసిల్వా(3/32), ఉదానా(2/41)లు రాణించారు. లంక విజయంలో కీలకపాత్ర పోషించిన మలింగక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
లంక నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 47 ఓవర్లకు 212 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్(82 నాటౌట్; 89బంతుల్లో 7ఫోర్లు, 4 సిక్సర్లు) చివరి వరకు ఉన్నా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. జో రూట్(57) అర్దసెంచరీతో రాణించినప్పటికీ కీలక సమయంలో ఔటయ్యాడు. ఇక బెయిర్ స్టో(0), మోర్గాన్(21), బట్లర్(10), విన్సే(14)లు పూర్తిగా నిరాశపరిచారు. స్టోక్స్‌కు అండగా ఎవరూ క్రీజులో నిలవకపోవడంతో ఆతిథ్య జట్టు ఓటమిపాలైంది.
మలింగ మొదలెట్టాడు.. డిసిల్వా కొనసాగించాడు
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు మలింగ్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. స్టార్ ఓపెనర్ బెయిర్ స్టోను గోల్డెన్ డక్‌గా వెనక్కి పంపిస్తాడు. అనంతరం విన్సేను కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువనియ్యలేదు. ఈ క్రమంలో రూట్, మోర్గాన్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే మోర్గాన్‌ను ఉదానా బోల్తాకొట్టించి పెవిలియన్‌కు పంపించాడు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన స్టోక్స్ రూట్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించిన అనంతరం రూట్‌ను మలింగ ఔట్ చేసి ఇంగ్లండ్‌కు మరోసారి షాక్ ఇస్తాడు. ఇక స్పిన్నర్ డిసిల్వా కూడా కీలక సమయంలో మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, రషీద్‌లను ఔట్ చేసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచాడు.
మాథ్యూస్ మెరిశాడు..
అంతకుముందు మ్యాథ్యూస్ (85 నాటౌట్: 115 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆదుకోవడంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న లంకకు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. 3 పరుగులకే ఓపెనర్లు దిముత్ కరుణరత్నే((1), కుశాల్ పెరీరా(2) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అవిష్కా ఫెర్నాండో(49: 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్ మెండిస్(46: 68 బంతుల్లో 2 ఫోర్లు) మూడో వికెట్‌కు 59 పరుగులు జోడించారు.
ఫెర్నాండో అవుటయ్యాక కుశాల్ మెండిస్– మాథ్యూస్ జోడీ 71 పరుగులు జోడించింది. అనంతరం కుశాల్ మెండిస్, జీవన్ మెండిస్ ఇలా వచ్చి అలా నిష్క్రమించాడు. మిగిలిన వారిలో ధనంజయ డిసిల్వా (29) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్ ఉడ్ చెరో మూడు వికెట్లు, ఆదిల్ రషీద్ రెండు వికెట్లు సాధించారు. క్రిస్ వోక్స్ వికెట్ తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment