సౌతాంప్టన్: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2019ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. బుధవారం స్థానిక మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో కోహ్లి సేన ఘన విజయం సాధించింది. సఫారీ జట్టు నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని మరో 15 బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా విజయంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(122 నాటౌట్; 144బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) కీలక పాత్ర పోషించాడు. రోహిత్‌తో పాటు రాహుల్(26), ధోని(34)లు రాణించారు. సఫారీ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు తీయగా.. మోరిస్, ఫెహ్లుక్వోయోలు తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆమ్లా(6), డికాక్(10)లు పూర్తిగా విఫలమయ్యారు. అయితే క్రిస్ మోరిస్(42) రాణించగా, డుప్లెసిస్(38), ఫెహ్లుక్వోయో(34), డేవిడ్ మిల్లర్(31), డస్సెన్(22)లు రాణించారు. చివర్లో రబడా(31 నాటౌట్) ఆకట్టుకోవడంతో సఫారీ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. భారత బౌలర్లలో యజ్వేంద్ర చహల్ నాలుగు వికెట్లతో రాణించగా, బుమ్రా, భువనేశ్వర్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్ యాదవ్‌కు వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment