లండన్: ప్రపంచకప్ 2019 సన్నాహకంలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ దారుణంగా విపలమయ్యారు. కివీస్ పేస్ అటాక్‌కు కోహ్లి గ్యాంగ్ విలవిల్లాడింది. ట్రెంట్ బౌల్ట్(4/33), నీషమ్(3/26) ధాటికి.. 39.2 ఓవర్లలో 179 పరుగులకే టీమిండియా కుప్పకూలింది. ఓ దశలో వంద పరుగులైన చేస్తుందనుకున్న తరుణంలో రవీంద్ర జడేజా(54) కీలక సమయంలో రాణించాడు. దీంతో కోహ్లి సేన కనీసం గౌరవప్రదమైన స్కోరునైనా చేయగలిగింది.
ప్రపంచకప్ ప్రారంభానికి ముందు నుంచే ఎంతో గంభీరంగా ఉన్న టీమిండియా ఆటగాళ్లకి ఇంగ్లండ్ పిచ్‌లు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో కివీస్ బౌలర్లు రుచిచూపించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోహ్లి సేనకు ట్రెంట్ బౌల్ట్ దడ పుట్టించాడు. బౌల్ట్ దెబ్బకి రోహిత్ శర్మ(2), ధావన్(2), రాహుల్(6)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కోహ్లి కూడా వారి దారిలోనే..
కీలక మూడు వికెట్లు కోల్పోవడంతో ఆదుకుంటాడని భావించిన సారథి విరాట్ కోహ్లి(18) కూడా నిరుత్సాహపరిచాడు. అయితే ఈ తరుణంలో హార్దిక్ పాండ్యాతో ధోని జత కట్టాడు. వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఇక ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో ఊపుమీదున్న హార్దిక్(30), కార్తీక్(4)లను నీషమ్ ఒకే ఓవర్‌లో ఔట్ చేశాడు. అనంతరం సౌథీ ధోని(16)ని ఔట్ చేసి టీమిండియాను కోలుకోని దెబ్బ కొట్టాడు. ఈ తరుణంలో రవీంద్ర జడేజా టెయిలెండర్లతో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు. కుల్దీప్(19) దీంతో కివీస్‌కు 180 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment