ఒక్కటైన అర్జెంటీనా
బ్యూనస్ ఎయిర్స్: 12 ఏళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం.. అవినీతి కుంభకోణాలతో సతమతమవుతున్న అర్జెంటీనా ఇప్పుడు ఒక్కటైంది. వారిలో దేశభక్తి మునుపెన్నడూ లేని రీతిలో ఉరకలెత్తుతోంది. దీనికి కారణం వారి ఫుట్‌బాల్ జట్టు. బ్రెజిల్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో తుది పోరుకు చేరుకోవడంతో తమ దేశ సమస్యలను మర్చిపోయి సంబరాల్లో మునిగిపోతున్నారు.
సెమీస్‌లో నెదర్లాండ్స్‌పై గెలవగానే బ్యూనస్ ఎయిర్స్ వీధులన్నీ హోరెత్తిపోయాయి. ఇటీవలి కాలంలో దేశంలో ఇంత సంతోషం ఎప్పుడూ కనిపించలేదు. ‘ఫైనల్ యుద్ధంలో మేమంతా ఒక్కటిగా నిలబడనున్నాం. క్రైమ్.. ఆర్థిక సమస్యల వార్తలతో నిండే మా ముఖసంచికలు ఇప్పుడు మెస్సీ, రొమెరో ఫొటోలతో నిండిపోతున్నాయి. ఇప్పుడు మేమంతా అర్జెంటీనియన్లం. మాది ఒక్కటే మాట’ అని కియోస్క్ పత్రిక యజమాని ఓస్వాల్డో డారికా అన్నారు.