ఫైనల్లో పరాజితులు లేరు  | World Cup Final Match In Game Terms Are Not Fair Said By Williamson | Sakshi
Sakshi News home page

ఫైనల్లో పరాజితులు లేరు 

Published Wed, Jul 17 2019 2:47 AM | Last Updated on Wed, Jul 17 2019 8:01 AM

World Cup Final Match In Game Terms Are Not Fair Said By Williamson - Sakshi

వెల్లింగ్టన్‌: ప్రపంచ కప్‌ ఫైనల్లో ఫలితాన్ని తేల్చిన తీరుపై న్యూజిలాండ్‌ వైపు నుంచి స్పందనలు కొనసాగుతూనే ఉన్నాయి. జట్టు కెప్టెన్‌ విలియమ్సన్‌ సహా కోచ్, మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద ఆరు పరుగుల (2+4) ఓవర్‌ త్రోపై  విలియమ్సన్‌ తమ దేశ మీడియాతో మాట్లాడుతూ... మ్యాచ్‌ ఆఖరి క్షణాల్లో అంపైర్లు చేసిన ఈ క్లిష్టమైన పొరపాటును తెలుసుకుని తామంతా ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నాడు. ‘నిబంధనలపై సంపూర్తి అవగాహన లేని మేం ఆ సమయంలో అంపైర్ల నిర్ణయాన్ని అంగీకరించాం. వందలకొద్దీ ఉన్న ఇతర నిబంధనల్లానే ఇదీ ఒకటని భావించాం తప్ప భిన్నమైనదని అనుకోలేదు’ అని అతడు తెలిపాడు.

తీవ్ర ఉత్కంఠగా సాగిన తుది సమరంలో పరాజితులు ఎవరూ లేరని విలియమ్సన్‌ వివరించాడు. ఫలితాన్ని చూస్తే ఒక్క కిరీటం (ప్రపంచ కప్‌ ట్రోపీ) దక్కడం తప్ప రెండు జట్ల మధ్య తేడా ఏదీ లేదని అతడు విశ్లేషించాడు. కోచ్‌ గ్యారీ స్టీడ్‌ స్పందిస్తూ... ప్రపంచ కప్‌ నిబంధనలను తప్పనిసరిగా సమీక్షించాలని కోరాడు. ఆటలో సమఉజ్జీలుగా నిలిచినప్పటికీ సాంకేతిక అంశాలతో ఓటమి పాలవడం బాధాకరంగా ఉందని అతడు అన్నాడు. ఎన్నో అంశాలు ఉండగా... ప్రపంచ కప్‌ ఫైనల్‌ లాంటి మ్యాచ్‌లో ఇలాంటి నిబంధనలు వర్తింప చేయాల్సి వస్తుందని వాటిని రూపొందించినవారు సైతం ఊహించి ఉండరని స్టీడ్‌ పేర్కొన్నాడు. ‘ఆరు పరుగుల ఓవర్‌ త్రో’ నిర్ణయంపై స్పందిస్తూ అంపైర్లూ మనుషులేనని వారూ పొరపాట్లు చేస్తారని, అయినా వారు మ్యాచ్‌ అధికారులు కాబట్టి వాటిని అంగీకరించాల్సిందేనని అన్నాడు.

భారత్‌లో జరిగే 2023 ప్రపంచ కప్‌నకు తమ జట్టు మరింత దృఢంగా తయారవుతుందని, టైటిల్‌కు గట్టి పోటీదారుగా నిలుస్తుందని కివీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ డానియెల్‌ వెటోరి ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫైనల్‌ ఓటమిని అతడు తేలిగ్గా తీసుకున్నాడు. మరోవైపు ఆటగాళ్లు విడివిడిగా స్వదేశం చేరుకుంటుండటంతో న్యూజిలాండ్‌ జట్టుకు స్వదేశంలో స్వాగత కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు. అయితే, వారి అద్వితీయ ప్రదర్శనకు తగిన రీతిలో స్వాగతం పలకాలని బోర్డు భావిస్తోంది. దీనికోసం దేశ ప్రధాని జెసిండా అర్డెమ్, క్రీడా మంత్రి గ్రాంట్‌ రాబర్ట్‌సన్‌తో సంప్రదింపులు జరుపుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement