చిన్న లక్ష్యాలు పెట్టుకోను | Wrestler Sushil Kumar Targets On Tokyo Medal | Sakshi
Sakshi News home page

చిన్న లక్ష్యాలు పెట్టుకోను

Apr 7 2020 4:04 AM | Updated on Apr 7 2020 4:04 AM

Wrestler Sushil Kumar Targets On Tokyo Medal - Sakshi

న్యూఢిల్లీ: అనూహ్య పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడటం కారణంగా మేలు పొందిన వారిలో భారత దిగ్గజ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ ఒకడు. వ్యక్తిగత విభాగంలో రెండు ఒలింపిక్‌ పతకాలు గెలుపొందిన ఏకైక భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించిన సుశీల్‌... ఈ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాడు. తాను బరిలో దిగే 74 కేజీల వెయిట్‌ కేటగిరీలో ఒలింపిక్‌ బెర్త్‌ కోసం తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, తన పనైపోయిందంటూ పలువురు విమర్శలు చేస్తున్నప్పటికీ అవేమీ తనను ప్రభావితం చేయలేవంటున్నాడు. టోక్యో పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నానన్న సుశీల్‌ మనోగతం అతని మాటల్లోనే...

వారికి అలవాటే... 
చాలా కాలం నుంచి నా గురించి ఎవరికి తోచింది వారు రాయడం అందరికి అలవాటైపోయింది. కానీ వారి రాతలు, అభిప్రాయాలు నాపై ప్రభావం చూపలేవు. 2011లోనే సుశీల్‌ పనైపోయిందని అన్నారు. కానీ 2008 బీజింగ్‌లో గెల్చిన కాంస్య పతకాన్ని లండన్‌ 2012 ఒలింపిక్స్‌లో రజతంగా మార్చాను. ఈ వ్యాఖ్యల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. ఇది నాకు రోజువారీ కార్యక్రమం అయిపోయింది.

సన్నద్ధతకు ఇదే సమయం... 
మరో నెల రోజుల్లో నేను 37వ పడిలో అడుగుపెడతా. అయితేనేం... నేను రెజ్లింగ్‌ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. ఒలింపిక్‌ బెర్తు సంపాదించేందుకు ప్రస్తుతం నాకు మంచి సమయం లభించింది. దీన్ని నేను టోక్యో  సన్నద్ధత కోసం వినియోగించుకుంటా.

గాయాల బారిన పడకూడదు... 
రెజ్లింగ్‌ క్రీడలో గాయాల బారిన పడకుండా, మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకొని నిరంతరం ప్రాక్టీస్‌ చేస్తూ ఉంటే చాలు. మనం అనుకున్నది సాధించవచ్చు. నేను ఇప్పటికీ రోజులో రెండుసార్లు ప్రాక్టీస్‌ చేస్తున్నా. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌తో ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. దేవుని దయతో టోక్యో ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధిస్తాననే నమ్మకముంది.

నర్సింగ్‌కు అభినందనలు... 
డోపింగ్‌లో పట్టుబడి నాలుగేళ్ల నిషేధం తర్వాత తిరిగి జూలైలో బరిలో దిగనున్న నర్సింగ్‌ యాదవ్‌కు అభినందనలు. పునరాగమనం అతనికి అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటున్నా. నర్సింగ్‌తో పోటీ గురించి ఇప్పుడే ఏం మాట్లాడలేను. సమయం వచ్చినప్పుడు దాని గురించి చూద్దాం. రియో ఒలింపిక్స్‌కు నర్సింగ్‌ కారణంగానే సుశీల్‌ దూరమైన సంగతి తెలిసిందే.

విదేశీ రెజ్లర్లే నా ప్రత్యర్థులు... 
చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే మనం ఏదీ సాధించలేం. జితేందర్‌ కుమార్, నర్సింగ్‌ యాదవ్‌లు కాదు... ఉజ్బెకిస్తాన్‌ రెజ్లర్, ఆసియా క్రీడల స్వర్ణపతక విజేత బెక్‌జోడ్‌ అబ్దురఖ్‌మోనోవ్‌లాంటి ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలో అనే అంశంపై దృష్టి సారించా. నా సన్నాహాలు మేటి రెజ్లర్లను ఎదుర్కొనేలా సాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement