21 ఏళ్ల తర్వాత... | Wriddhiman Saha ton in vain as Maharashtra crush Bengal to enter final | Sakshi
Sakshi News home page

21 ఏళ్ల తర్వాత...

Published Tue, Jan 21 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM

21 ఏళ్ల తర్వాత...

21 ఏళ్ల తర్వాత...

ఇండోర్: రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. గ్రూప్ ‘సి’లో అగ్రస్థానంలో నిలవడంతో పాటు రంజీ దిగ్గజం ముంబైని క్వార్టర్స్‌లో ఓడించిన ఆ జట్టు.... తమ విజయాలు గాలివాటం కాదని నిరూపించింది. సోమవారం ఇక్కడ మూడు రోజుల్లోనే ముగిసిన సెమీ ఫైనల్లో మహారాష్ట్ర 10 వికెట్ల తేడాతో బెంగాల్‌ను చిత్తు చేసి ఫైనల్లోకి అడుగు పెట్టింది.

 1992-93 సీజన్ తర్వాత ఆ జట్టు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆ సీజన్ ఫైనల్లో పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది. 1939-40, 1940-41లలో వరుసగా రెండేళ్లు మహారాష్ట్ర ఈ టోర్నీ విజేతగా నిలిచింది.

 సాహా సెంచరీ వృథా...
 ఓవర్‌నైట్ స్కోరు 16/1తో మూడో రోజు ఆట ప్రారంభించిన బెంగాల్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. వృద్ధిమాన్ సాహా (146 బంతుల్లో 108 నాటౌట్; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించడం విశేషం. ఇతర ఆటగాళ్లలో ఛటర్జీ (49), సర్కార్ (35), అరిందమ్ దాస్ (34) కొద్ది సేపు పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. మహారాష్ట్ర బౌలర్లలో జోసెఫ్, సంక్లేచా, ఫలా తలా 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 8 పరుగుల విజయలక్ష్యాన్ని మహారాష్ట్ర వికెట్ నష్టపోకుండా అందుకుంది.
 
  కర్ణాటకకు ఆధిక్యం
 మొహాలీ: కరుణ్ నాయర్ (191 బంతుల్లో 107 బ్యాటింగ్; 9 ఫోర్లు) అజేయ శతకం సాధించడంతో పంజాబ్‌తో జరుగుతున్న మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక భారీ స్కోరు దిశగా వెళుతోంది.   మ్యాచ్ మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది.

నాయర్, అమిత్ వర్మ (152 బంతుల్లో 65 బ్యాటింగ్; 11 ఫోర్లు) ఆరో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 110 పరుగులు జోడించారు. గౌతమ్ (48), ఉతప్ప (47) ఫర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో హర్భజన్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం కర్ణాటక 81 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది. పంజాబ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌటైంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement