యూనిస్ మిస్సయ్యాడు!
సిడ్నీ: పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ అరుదైన ఘనతను సాధించే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. ఆస్ట్రేలియాతో్ జరిగిన చివరిదైన మూడో టెస్టులో యూనిస్ ఖాన్ పదివేల టెస్టు పరుగుల క్లబ్లో చేరే అవకాశాన్ని మిస్సయ్యాడు. ఈ మ్యాచ్లో మరో 23 పరుగులు చేసి ఉంటే పదివేల పరుగుల క్లబ్ లో యూనిస్ చేరేవాడు. తొలి ఇన్నింగ్స్ లో 175 పరుగులతో అజేయంగా నిలిచిన యూనిస్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 13 పరుగులను మాత్రమే చేసి అవుటయ్యాడు. దాంతో ఈ సిరీస్లో పదివేల టెస్టు పరుగుల్ని సాధించే అవకాశాన్నిస్వల్ప తేడాలో కోల్పోయాడు. ఇప్పటికి 115 టెస్టు మ్యాచ్లను ఆడిన యూనిస్ ఖాన్ 9,977 పరుగుల్ని సాధించాడు. ఇప్పటివరకూ పాకిస్తాన్ ఆటగాళ్లు ఎవ్వరూ 10 వేల టెస్టు పరుగుల క్లబ్లో లేని సంగతి తెలిసిందే.
రాబోవు రోజుల్లో యూనిస్ ఖాన్ కు మరికొన్ని మ్యాచ్లు ఆడే అవకాశం దక్కితే ఆ ఘనతను అందుకునే తొలి పాకిస్తాన్ క్రికెటర్గా నిలుస్తాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం ద్వారా ఐసీసీ ఆతిథ్యం ఇచ్చిన 11 దేశాల్లోనూ శతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా యూనిస్ ఘనత సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 220 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ తన రెండో ఇన్నింగ్స్ లో 244 పరుగులకే పరిమితం కావడంతో ఘోర ఓటమి పాలైంది. దాంతో సిరీస్ను పాకిస్తాన్ 0-3 తేడాతో కోల్పోయింది.