మ్యాచ్ చూస్తుంటే కుక్క అరిచిందని...
టీమిండియా - ఆస్ట్రేలియా మధ్య సెమీస్ బెర్తు కోసం జరిగిన పోరాటం ప్రేక్షకులకు ఎంత టెన్షన్ తెప్పించిందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ఆదివారం రాత్రి ఈ మ్యాచ్ సందర్భంగా జరిగిన చిన్న గొడవ ఓ యువకుడి హత్యకు కారణమైంది. కొంతమంది యువకులు కలిసి జేసీ నగర్ బస్తీలో ఓ పెద్ద స్క్రీన్ మీద క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా జాన్ కెనడీ అనే వ్యక్తి తన కుక్కను తీసుకుని అక్కడకు వచ్చాడు. మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగుతూ అందరూ టెన్షన్‌లో ఉండగా కుక్క మొరగడం మొదలుపెట్టింది. దాంతో అక్కడ ముందు నుంచి మ్యాచ్ చూస్తున్నవాళ్లు జాన్‌ను అక్కడి నుంచి కుక్కను తీసుకుని వెళ్లిపొమ్మని కోరారు. అయితే కెనడీ అందుకు నిరాకరించడంతో వాళ్లు అక్కడినుంచి అతడిని తోసేశారు.
కాసేపటి తర్వాత అతడు తన స్నేహితులతో కలిసి వచ్చి అక్కడున్న కుర్రాళ్లపై దాడి చేశాడు. వారిలో ఉన్న అవినాష్ (20) అనే యువకుడిని పగిలిన బీరు బాటిల్‌తో పొడిచాడు. దాంతో తీవ్రంగా గాయపడిన అవినాష్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయాడు. హత్యా నేరంపై పోలీసులు కెనడీని అరెస్టు చేశారు.