‘సి' గ్రేడ్‌కు యువరాజ్!
ముంబై: పేలవ ఫామ్‌తో జట్టులో చోటు దక్కిం చుకోవడానికి ఇబ్బంది పడుతున్న డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బీసీసీఐ ఆటగాళ్ల కాంట్రాక్టుల్లోనూ దిగజారబోతున్నాడా..? పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయి. ఇప్పటిదాకా కెప్టెన్ ఎంఎస్ ధోని, కోహ్లి, అశ్విన్, రైనాలతో కూడిన గ్రేడ్ ‘ఎ’లో ఉన్న అతను తాజా ఆటగాళ్ల ఒప్పంద పునరుద్ధరణలో గ్రేడ్ ‘సి’కి పడిపోయే అవకాశాలున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. గతేడాది డిసెంబర్‌లో చివరి వన్డే ఆడిన యువీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో జాతీ య జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు.
ఇక ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో సత్తా ని రూపించుకున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ భువనేశ్వర్‌లకు బంపర్ ఆఫర్ లభించనుంది. వీరిద్దరు ఎలైట్ గ్రూప్ అయిన ‘ఎ’లో చోటు దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఇదే గ్రూపులో ఉన్న రైనా టెస్టు జట్టులో లేకపోయినా వన్డేల్లో చూపిన ప్రతిభతో అతడి స్థానానికి ఢోకా లేనట్టే. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండూల్కర్ పేరు త్వరలో వెలువరించే కొత్త జాబితా నుంచి తొలగిపోనుంది.
మరోవైపు యువ బ్యాట్స్‌మన్ రహానే, రాయుడు, షమీ మంచి ప్రదర్శన కనబరచడంతో గ్రేడ్ ‘బి’కి రానున్నారు. ఇదే గ్రూపు లో చోటుకు మోహిత్ శర్మ కూడా గట్టి పోటీదారుగా కనిపిస్తున్నాడు. స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా గ్రేడ్ ‘సి’కి పడిపోనున్నాడు.
ఇప్పటిదాకా కాంట్రాక్టుల జాబితాలో లేని సంజూ శామ్సన్, పంకజ్ సింగ్, ఈశ్వర్ పాండే, కరణ్ శర్మ భారత్ తరఫున బరిలోకి దిగడంతో నిబంధనల ప్రకారం గ్రేడ్ ‘సి’లో చోటు దక్కించుకుంటారు.