టీమిండియాను యువీయే గెలిపిస్తాడు: మురళీధరన్
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో పేలవ ప్రదర్శనతో విమర్శల పాలైన యువజరాజ్ సింగ్.. ఐపీఎల్లో ఒక్కసారిగా మళ్లీ విరుచుకుపడి ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. రాబోయే ప్రపంచకప్లో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించే సత్తా యువీకే ఉందని బెంగళూరు జట్టు సీనియర్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ చెబుతున్నాడు. 29 బంతుల్లో తొమ్మిది సిక్సర్లు, ఒక ఫోర్తో 68 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించిన యువరాజ్ చాలాకాలం తర్వాత మళ్లీ ఫామ్లోకి వచ్చాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో యువరాజ్ మంచి ఆటగాడని, కానీ కొన్నిసార్లు అతడి ఆత్మవిశ్వాసం మాత్రం పడిపోతుంటుందని మురళీ అన్నాడు. టి20 ప్రపంచకప్ తర్వాత దేశమంతా అతడిపై తీవ్ర ఒత్తిడి పెట్టిందని, అలాంటి పరిస్థితుల్లోనే తాను కూడా ఆడానని చెప్పాడు. ఒక్కాసారి యువీ ఫామ్ లోకి వచ్చాడంటే ఇక అతడిని ఆపడం, అడ్డుకోవడం ఎవరివల్లా అయ్యేపని కాదని తెలిపాడు.