
యువరాజ్ సింగ్(ఫైల్‌ఫొటో)
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పలు రికార్డులను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన రికార్డుతో పాటు 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి తక్కువ బంతుల్లో ఆ ఫీట్ నమోదు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. అయితే టీ20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధ్యమే అంటున్నాడు యువీ. దీనిపై యువీ మాట్లాడుతూ..‘ టీ20ల్లో డబుల్ సెంచరీ అంటే చాలా కష్టం.. అంత ఈజీ కాదు.. కానీ అది అసాధ్యం కూడా కాదు. ఇప్పుడు క్రికెట్ గేమ్‌ను చూస్తే సాధ్యం కానిది ఏదీ లేదనే అనిపిస్తుంది. టీ20ల్లో డబుల్ సెంచరీ కొట్టి అవకాశం నా దృష్టిలో ముగ్గురికి ఉందని నమ్ముతున్నా. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మలకు టీ20ల్లో ద్విశతకం సాధించే సత్తా ఉంది’ అని యువీ తెలిపాడు.
అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మ ఇప్పటివరకూ నాలుగు శతకాలు సాధించగా, అతని సరసన ఇంకా ఏ క్రికెటరూ చేరలేదు. ఆసీస్‌కు చెందిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, న్యూజిలాండ్ హార్డ్ హిట్టర్ కొలిన్ మున్రోలు తలో మూడు సెంచరీలతో రోహిత్ తర్వాత స్థానంలో ఉన్నారు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఆసీస్ ఆటగాడు అరోన్ ఫించ్ పేరిట ఉంది. 2018లో జింబాబ్వేపై ఫించ్ 172 పరుగులు సాధించాడు. ఇదే ఇప్పటికీ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అఫ్గానిస్తాన్‌కు చెందిన హజ్రుతుల్లా జజాయ్ 162 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్ టీ20ల్లో అత్యధిక స్కోరు క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013లో ఆర్సీబీ తరఫున గేల్ అజేయంగా 175 పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment