విరాట్ కోహ్లితో రోహిత్ శర్మ
T20 World Cup 2022- Rohit Sharma: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం (అక్టోబరు 16) నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటికే టీమిండియా సభ్యుడిగా పలుసార్లు ఈ మెగా టోర్నీ ఆడిన రోహిత్ శర్మ ఈసారి కెప్టెన్‌గా కొత్త హోదాలో బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్‌లో అద్భుత రికార్డు ఉన్న హిట్‌మ్యాన్‌ను ఊరిస్తున్న ఐదు రికార్డులను ఓసారి పరిశీలిద్దాం.
1.కెప్టెన్‌గా అరుదైన రికార్డు సాధించే అవకాశం
యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ హిట్టర్ క్రిస్‌గేల్ 2010 ప్రపంచకప్‌లో తమ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఆ సందర్భంగా టీమిండియాతో మ్యాచ్‌లో 66 బంతులు ఎదుర్కొన్న అతడు 98 పరుగులు సాధించాడు.
ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో ఒక కెప్టెన్‌కు ఇదే అత్యధిక స్కోరు. ఇప్పుడు రోహిత్ శర్మకు ఈ అరుదైన రికార్డును బద్దలు కొట్టే సువర్ణావకాశం ముందుంది. టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగనున్న హిట్‌మ్యాన్ 99 లేదంటే ఏకంగా సెంచరీ సాధించాడంటే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన సారథిగా నిలుస్తాడు.
2. నాలుగో స్థానం నుంచి..
టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక లెజెండ్ మహేళ జయవర్దనేకు అత్యధిక పరుగుల వీరుడిగా రికార్డు ఉంది. మొత్తంగా ఐదుసార్లు ఈ ఐసీసీ ఈవెంట్ ఆడిన జయవర్ధనే 1016 పరుగులు సాధించాడు.
విండీస్ హిట్టర్ క్రిస్‌గేల్ 965, తిలకరత్నె దిల్షాన్ 897 పరుగులతో అతడి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాన్ని రోహిత్ శర్మ ఆక్రమించాడు. ఇప్పటి వరకు 847 పరుగులు సాధించాడు. ఈసారి ప్రపంచకప్‌లో అతడు మొత్తంగా 169 పరుగులు సాధిస్తే అత్యధిక పరుగుల వీరుడిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
3. ఈ రికార్డు లాంఛనమే!
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 2007లో టీమిండియా తరఫున తొలిసారి టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు ఆడిన అతడు.. మరో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంటే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా నిలుస్తాడు.
ధోని, గేల్, ముష్షికర్ రహీంలను దాటుకుని.. శ్రీలంక ఆటగాడు తిలకరత్నె దిల్షాన్(35 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డు బద్దలు కొడతాడు. ఎలాంటి ఆటంకాలు, గాయాల బెడద వంటివి లేకుండా రోహిత్ బరిలోకి దిగితే ఈ రికార్డు సాధించడం లాంఛనమే!
ఇప్పటి వరకు టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు
►తిలకరత్నె దిల్షాన్-35
►డ్వేన్ బ్రావో- 34
►షోయబ్ మాలిక్- 34
►ఎంఎస్ ధోని- 33
►క్రిస్ గేల్-33
►ముష్ఫికర్ రహీం- 33
►రోహిత్ శర్మ- 33
4. బ్రెండన్ మెకల్లమ్ రికార్డు అధిగమించే అవకాశం
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ఇంగ్లండ్ ప్రస్తుత కోచ్ బ్రెండన్ మెకల్లమ్ టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో తన పేరిట అరుదైన రికార్డు లిఖించుకున్నాడు. 2012లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 58 బంతుల్లో 123 పరుగులు సాధించి.. అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు.
ఇక మెగా ఈవెంట్‌లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 65 బంతుల్లో 79 పరుగులు. 2010లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ఈ స్కోరు సాధించాడు. ఇక పొట్టి క్రికెట్‌లో ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్‌లో 4 సెంచరీలు నమోదు చేసిన హిట్‌మ్యాన్ .. మరో శతకం బాదడం సహా అదనంగా మరో 24 పరుగులు సాధిస్తే మెకల్లమ్‌ను అధిగమించే అవకాశం ఉంది.
5. ఇంకో మూడు సిక్స్‌లు కొడితే
టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ శర్మ కచ్చితంగా బద్దలు కొట్టగల మరో రికార్డు ఇది. ఇప్పటి వరకు ఈ ఐసీసీ టోర్నీలో 31 సిక్సర్లు కొట్టిన హిట్‌మ్యాన్.. మరో మూడు సిక్స్‌లు బాదితే చాలు. ఈ మేజర్ ఈవెంట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
తద్వారా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డు(33 సిక్స్‌లు) బద్దలు కొడతాడు. అక్టోబరు 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ ఈ ఫీట్ నమోదు చేయాలని ఆశిస్తూ హిట్‌మ్యాన్‌కు ఆల్ ది బెస్ట్ చెబుదాం!!
-సాక్షి, వెబ్‌డెస్క్
చదవండి: Ind Vs WA XI: రాహుల్ ఇన్నింగ్స్ వృథా.. కుప్పకూలిన మిడిలార్డర్.. టీమిండియాకు తప్పని ఓటమి
Comments
Please login to add a commentAdd a comment