యువీ కనీస విలువ రూ. 2 కోట్లు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2016) వేలం కోసం రంగం సిద్ధమైంది. వచ్చే నెల 6న బెంగళూరులో ఈ వేలం నిర్వహిస్తారు. వేలం కోసం ప్రాథమికంగా 714 మంది క్రికెటర్లు తమ కనీస విలువను పేర్కొంటూ అందుబాటులోకి వచ్చారు. ఇందులో 12 మంది ఆటగాళ్ల కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది. గత రెండేళ్లుగా వేలంలో అత్యధిక మొత్తం పలికి... ఆ తర్వాత ఫ్రాంచైజీ తిరస్కరణకు గురైన భారత సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈ జాబితాలో ఉన్నాడు.
బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న కెవిన్ పీటర్సన్, ఇదే టోర్నీలో తన కెప్టెన్సీతో సిడ్నీ థండర్‌ను విజేతగా నిలిపిన మైక్ హస్సీతో పాటు భారత బౌలర్లు ఇషాంత్ శర్మ, ఆశిష్ నెహ్రా కూడా అత్యధిక మొత్తంతో బరిలో నిలిచారు. పుణే, రాజ్‌కోట్ రూపంలో రెండు కొత్త జట్లు రావడంతోపాటు వివిధ ఫ్రాంచైజీలు 61 మంది ఆటగాళ్లను విడుదల చేయడంతో ఈసారి వేలం భారీ ఎత్తున, ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.
వేలంలోకి రానున్న కొందరు ప్రధాన ఆటగాళ్లు
కనీస విలువ రూ. 2 కోట్లు: యువరాజ్ సింగ్, పీటర్సన్, వాట్సన్, ఇషాంత్, మిషెల్ మార్ష్, ఆశిష్ నెహ్రా, దినేశ్ కార్తీక్, స్టువర్ట్ బిన్నీ, సంజు శామ్సన్, ధావల్ కులకర్ణి.
రూ. 1.5 కోట్లు: డేల్ స్టెయిన్, మోహిత్ శర్మ, జాస్ బట్లర్.
రూ. 1 కోటి: ఇర్ఫాన్ పఠాన్, టిమ్ సౌతీ.
రూ. 50 లక్షలు: మార్టిన్ గప్టిల్, జాసన్ హోల్డర్, బరీందర్ శరణ్