న్యూఢిల్లీ:భారత క్రికెట్ జట్టులో విపరీతమైన పోటీ పెరిగిపోయిన నేపథ్యంలో కొంతమంది సీనియర్ ఆటగాళ్ల పరిస్థితి డైలమాలో పడింది. అందులో యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలు ముందు వరుసలో ఉన్నారు. వీరిద్దరూ మళ్లీ భారత్ జట్టులో చోటు సంపాదిస్తారా?లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. అయితే వీరికి ఊహించని మద్దతు టీమిండియా మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్ ను లభించింది. భారత క్రికెట్ జట్టులో యువీ-రైనాలు ఉండాల్సిన అవసరం ఉందంటూ అజహరుద్దీన్ స్పష్టం చేశాడు. ఇక క్రికెటర్ల ఫిట్ నెస్ కోసం నిర్వహించే యో యో టెస్టు నుంచి కూడా వారికి మినహాయింపు ఇస్తే బాగుంటుందని అజహర్ సూచించాడు.
' నాకు యో యో టెస్టు గురించి నిజంగా తెలీదు. ఆటగాళ్లు ఫిట్ నెస్ కోసం నిర్వహించే టెస్టు అని మాత్రం తెలుసు. ఒక బెంచ్ మార్కును సిద్ధం చేసేటప్పుడు యో యో టెస్టును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇక్కడ ఆటగాళ్లు ఫిట్ గా ఉంటేనే ఆడాలి.. లేకపోతే జట్టుకు దూరంగా ఉండాలి. అయితే దాదాపు కెరీర్ ముగింపు దశకు వచ్చిన ఆటగాళ్లు యో యో టెస్టులో పాస్ అవ్వడం కష్టమని నేను అనుకుంటున్నా. యువరాజ్, రైనాలను చూస్తే వారిదర్దూ ఇప్పటికీ ఫిట్ నెస్ పరంగా బాగానే ఉన్నప్పటికీ, యో యో టెస్టులో విఫలమవుతున్నారు. క్యాన్సర్ తో పోరాటం చేసిన వ్యక్తికి(యువరాజ్) పూర్తి స్థాయి ఫిట్ నెస్ లో ఎలా ఉంటాడు. యో యో ప్రామాణికంగా ఇచ్చే పాయింట్లను ఎలా సాధించి ఫిట్ నెస్ నిరూపించుకుంటాడు. ఇది చాలా కష్టం. అలాగే నెల క్రితం రైనాను చూసినప్పుడు అతను ఫిట్ గానే ఉన్నాడు. ఫిట్ నెస్ విషయంలో యువీ-రైనాలకు కొంతవరకూ వెసులుబాటు ఇస్తే బాగుంటుంది. అందరికీ యో యో టెస్టులు అవసరం లేదనేది అభిప్రాయం. ఇక్కడ జట్టు యాజమన్యం ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరైనా తిరిగి చోటు సంపాదిస్తారు. వారిద్దరూ భారత జట్టులో ఉండాలనేది నా అభిప్రాయం'అని అజహర్ పేర్కొన్నాడు. యువీ-రైనాలు యో యో టెస్టులో పాసైతే శ్రీలంకతో పరిమిత ఓవర్లకు వారి పేర్లను పరిశీలించే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో అజహర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment