ఇంకా యువరాజ్ సింగ్ కు ఛాన్సుంది?
ముంబై: టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రాబోయే ప్రపంచకప్ లో ఆడే అవకాశాలు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదు. ప్రస్తుతం జట్టు సమీకరణాలను పరిశీలిస్తే యువరాజ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెల్లో విడుదల చేసిన భారత ప్రపంచ కప్ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకోలేకపోయిన ఈ డాషింగ్ ఆటగాడికి తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్సు ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఆసీస్ పర్యటనలో గాయపడ్డ రవీంద్ర జడేజాకు ప్రపంచకప్ తుది జట్టులో స్థానం దాదాపు ఖాయంగానే కనబడుతోంది. ఐసీసీ నిబంధలన మేరకు ఈనెల 7వ తేదీలోపు ప్రపంచకప్ కోసం అన్ని జట్లు తమ ఆటగాళ్ల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఒకవేళ రవీంద్ర జడేజాకు అవకాశం సెలెక్టర్లు అవకాశం కల్పించినా.. గడువు లోపు జడేజా కోలుకోకపోతే మాత్రం యువరాజ్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. వరల్డ్‌కప్ నిబంధనల ప్రకారం వైద్యపరమైన కారణాలతో తుది జట్టులో లేని ఆటగాడిని ఎంపిక చేసుకునేందుకు వీలుండటంతో యువరాజ్ ఆడే అవకాశాలు లేకపోలేదు. ఇటు బీసీసీఐ కాంట్రాక్ట్ తో పాటు, అటు రాయల్ ఛాలెంజర్స్ జట్టులో స్ధానం కోల్పోయిన యువరాజ్ రంజీల్లో ఆకట్టుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఆడిన రంజీ మ్యాచ్ ల్లో మూడు సెంచరీలతో పాటు ఒక అర్ధ సెంచరీ నమోదు చేశాడు.