శ్రీకాకుళం: జిల్లాలో 5వేల జనాభా దాటిన గ్రామాల్లో బ్యాంకింగ్ అవుట్‌లెట్లు ఏర్పాటు చేసేందుకు పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. 5 వేల జనాభా దాటిన గ్రామంలో బ్యాంకు బ్రాంచిని ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంకు అన్ని యాజమాన్యాలకు 2014లో దిశానిర్దేశం చేసింది. జిల్లాలో అప్పట్లో 15 గ్రామాలను బ్యాంకు ఏర్పాటుకు ఎంపిక చేశారు. స్థాయిని బట్టి ఆయా గ్రామాల్లో బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు కేటాయింపులు జరిపారు. బ్యాంకు శాఖలను ప్రారంభించే ముందు ఆయా యాజమాన్యాలు సర్వే చేయించాయి.
గ్రామస్థాయిలో ఇద్దరు ముగ్గురు ఉద్యోగులతో శాఖలను ప్రారంభించినా.. అందుకు తగ్గ లావాదేవీలు జరగవని గుర్తించాయి. ఇదే విషయాన్ని ఆర్‌బీఐకు నివేదించాయి. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి వారికిచ్చే వడ్డీకి మరో రెండుమూడు శాతం ఎక్కువగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు రుణాన్ని ఇవ్వడం బ్యాంకుల విధి కాగా లావాదేవీలు జరగనప్పుడు రుణాలు ఇవ్వడం కూడా సాధ్యపడదని ఆర్‌బీఐ దృష్టికి పలు బ్యాంకులు తీసుకెళ్లాయి. బ్యాంకు శాఖ బదులుగా బ్యాంకింగ్ అవుట్‌లెట్లు ఏర్పాటు చేస్తామని బ్యాంకులు ఆర్‌బీఐకు స్పష్టం చేశాయి.
ఎలా నిర్వహిస్తారంటే..
ఓ బ్యాంకు ప్రతినిధిని గ్రామంలో నియమస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక ప్రదేశంలో ఉండి.. లావాదేవీలు నిర్వహిస్తారు. ఖాతాదారుడు ఈ ప్రతినిధి ద్వారా రూ.10వేల వరకు లావాదేవీలు జరుపుకొనే వీలు కల్పిస్తామని ఆర్‌బీఐకి వివరించారు. దీనికి ఆర్‌బీఐ సమ్మతించించింది. ఎప్పటిలోగా వీటిని ఏర్పాటు చేస్తారో తెలియజేయాలని బ్యాంకు యాజమాన్యాలను కోరింది. మార్చి 31వ తేదీలోగా వీటిని ఏర్పాటుచేస్తామని తెలిపాయి. దీనికి ఆర్‌బీఐ సమ్మతించడంతో అవుట్‌లెట్లు ఏర్పాటు చేసే పనిలో బ్యాంకు యాజమాన్యాలు ఉన్నాయి. ప్రస్తుతం స్థలాలను గుర్తించే పనిలో పడ్డాయి.
తొలి అవుట్‌లెట్ రాజాపురంలో
కవిటి మండలం రాజాపురం ఆంధ్రాబ్యాంకు శాఖ ఈ నెల 31వ తేదీలోగా బ్యాంకు పరిధిలోని భైరి గ్రామంలో బ్యాంకింగ్ అవుట్‌లెట్లను తొలిసారిగా ప్రారంభించనుంది. మార్చి 31వ తేదీ లోగా మిగిలిన అన్ని బ్యాంకులు కూడా ఎంపిక చేసిన 15 గ్రామాల్లో అవుట్ లెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇది పూర్తయితే గ్రామ స్థాయిలోనే బ్యాంకింగ్ అందుబాటులోకి రానున్నాయి.
మార్చి 31లోగా అవుట్ లెట్ల ఏర్పాటు
జిల్లాలో ఎంపిక చేసిన 15 గ్రామాల్లో మార్చి 31లోగా బ్యాంకింగ్ అవుట్ లెట్లను ఏర్పాటు చేస్తాం. జిల్లాలో 30 బ్యాంకులకు సంబంధించి 300 శాఖలు లావాదేవీలు జరుపుతున్నాయి. అవుట్‌లెట్లు వినియోగంలోకి వస్తే 315 అవుతాయి. వ్యాపారం బాగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని బ్యాంకు శాఖలను యాజమాన్యాలు ఏర్పాటు చేయబోతున్నాయి. ప్రజలకు సౌకర్యవంతమైన సేవలందించడమే ధ్యేయంగా బ్యాంకులు పనిచేస్తున్నాయి. – పొట్లూరి వెంకటేశ్వరరావు, లీడ్ బ్యాంకు మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment