ఈ చిత్రం చూశారా? శ్రీకాకుళం నగరంలోనే... రోజూ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి రాకపోకలు చేసే అరసవల్లి రోడ్డుకు పక్కనే... ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కొత్త ఇంటికి సమీపంలోనే అక్రమంగా నిర్మాణ పనులు జరుగుతున్న కన్వెన్షన్ హాల్!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం : ఈ నిర్మాణం గురించి స్థలం సొంతదారైన దేవాదాయశాఖకు సమాచారం లేదు! దీనిపై నోటీసు ఇచ్చి నెలలు గడిచిపోతున్నా సమాధానమూ ఇవ్వలేదు! ఈ స్థలం ఉన్న ఖాజీపేట పంచాయతీ నుంచి నిర్మాణానికి అనుమతీ లేదు! వుడా అప్రూవల్ ప్లాన్ కూడా లేదు! ఈ నిర్మాణ పనులు నిలిపేయాలన్న జిల్లా కలెక్టరు ఆదేశాలు పట్టించుకోవట్లేదు! ‘మీరు కూల్చేయకపోతే... తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తాం’ అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ శ్రేణులు గళమెత్తినా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లే ఉంది! ఈ బడాబాబుల ధీమా వెనుక ధైర్యం ఎవరు? అంటే అందరి వేళ్లూ అధికార పార్టీ నాయకుల వైపే చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖాజీపేట పంచాయతీ కార్యదర్శి శనివారం ముచ్చటగా మూడోసారి నోటీసులు ఇవ్వడం గమనార్హం.
పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు...
రాష్ట్ర విభజన, శ్రీకాకుళం నగరపాలక సంస్థగా ఆవిర్భావం తదితర పరిణామాలతో శ్రీకాకుళం నగర పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. లేఅవుట్‌లు కూడా భారీ సంఖ్యలోనే వెలిశాయి. మరోవైపు శ్రీకాకుళం నగరంలో అక్రమ అపార్ట్‌మెంట్లతో పాటు గ్రూప్ హౌస్‌లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఎలాంటి అనుమతులూ లేకుండా ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నవే వంద వరకూ ఉంటాయని అంచనా. వాటికి ముందు రాత్రికిరాత్రే నిర్మాణాలు పూర్తిచేసి తెల్లసున్నం కొట్టేసిన భవనాలు కూడా అదే సంఖ్యలో ఉంటాయి. వీటిలో చాలావరకూ భవనాల క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్) కింద రెగ్యులరైజ్ అయిపోయాయి. వాటి యజమానుల్లో ఎక్కువ మంది అధికార పార్టీ నాయకులు, ఆ పార్టీ మద్దతుదారులే. ఇంతెత్తున అక్రమ నిర్మాణాలు సాగుతున్నా ఇప్పటివరకూ నగరపాలక సంస్థ యంత్రాంగం కానీ, వుడా టౌన్‌ప్లానింగ్ అధికారులు కానీ ఉదాసీనంగానే వ్యవహరించారు. దీనికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, అలాగే అవినీతి వ్యవహారాలు కూడా కారణాలే. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే బడ్జెట్ హోటల్ లీజుదారులు అక్రమంగా నిర్మిస్తున్న కన్వెన్షన్ హాల్. ఇదొక్కటే కాదు శ్రీకాకుళం సింహద్వారం నుంచి కొత్త వంతెన వరకూ, పీఎన్ కాలనీ, న్యూకాలనీ, అరసవల్లి రోడ్డు, 80ఫీట్ రోడ్డు, హౌస్‌బోర్డింగ్ కాలనీ, పెద్దపాడు రోడ్డు... ఇలా ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. బడాబాబులను చూసి సామాన్యులు కూడా ఇంటి నిర్మాణాలకు దిగుతున్నారు. కొత్తగా ఇల్లు నిర్మించుకోవడమో, లేదా ఒకటీ రెండు అంతస్థులకు ప్లాన్ అనుమతి పొంది ఆపై అదనపు అంతస్తు నిర్మించడమో చేస్తున్నారు.
ఆగమేఘాలపై కదలిక వెనుక...
బడ్జెట్ హోటల్ లీజుదారులు అక్రమంగా నిర్మిస్తున్న కన్వెన్షన్ హాల్‌పై టౌన్‌ప్లానింగ్ అధికారులు, అధికార పార్టీ నాయకులు అమితమైన ఉదాసీనత చూపించడంపై ఇటీవల కాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్మాణం కూల్చివేయాలంటూ ఈనెల 5వ తేదీన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీఎత్తున నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే అధికార పార్టీ నాయకులు, అధికారులు ఒక వ్యూహం ప్రకారం నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కన్వెన్షన్ హాల్ వంటి బడాబాబుల బిల్డింగ్‌లు గాకుండా సామాన్యుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది.
అక్రమార్కుల స్వార్థంతో లక్ష్యానికి గండి...
జిల్లాలోని అరసవిల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, శాలిహుండం వంటి పుణ్యక్షేత్రాలతో పాటు కళింగపట్నం తదితర పర్యాటక ప్రదేశాలను ఏటా సగటున 20 లక్షల మంది వరకూ సందర్శిస్తున్నారు. సామాన్య భక్తులకు సైతం త్రీస్టార్ హోటల్ వసతి సేవలను చౌకగా అందించాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ హోటల్ నిర్మాణానికి నాంది పలికారు. అరసవిల్లి జంక్షన్‌లో సూర్యనారాయణస్వామి ఆలయానికి సమీపంలో దేవాదాయశాఖకు చెందిన ఖాజీపేట పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 12/1లో దాదాపు 2.68 ఎకరాల భూమిని ఇందుకోసం కేటాయించేలా కృషి చేశారు. ఆ భూమిలో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో బడ్జెట్ హోటల్‌తో పాటు నగరప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వీలుగా తిరుపతి–తిరుమల దేవస్థానం (టీటీడీ) ఆర్థిక సహాయంతో కల్యాణ మండపం నిర్మించాలని తలపోశారు. ఈ భూమిలో 1.20 ఎకరాలు ఈ కల్యాణ మండపానికి, మిగిలిన 1.48 ఎకరాలు బడ్జెట్ హోటల్‌కు దేవాదాయశాఖ కేటాయించింది. బడ్జెట్ హోటల్ కోసం దేవాదాయశాఖ, పర్యాటక శాఖల మధ్య 2010–11లో లీజు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం వరుసగా ఐదేళ్ల పాటు ఏటా రూ.3,22,344 చొప్పున లీజును పర్యాటకశాఖ చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం రూ.16.11 లక్షలను కాంట్రాక్టరు నుంచి పర్యాటక శాఖ వసూలు చేసి అరసవిల్లి ఆలయానికి అప్పగించాల్సి ఉంది. ఇప్పటివరకూ పైసా కూడా వసూలుకాలేదు. ఈ మొత్తం వెంటనే చెల్లించాలని దేవాదాయశాఖ అధికారులు పర్యాటక శాఖకు రెండు నెలల క్రితం నోటీసులు జారీ చేశారు. అంతేకాదు బడ్జెట్ హోటల్ లీజుదారులు తమకు కనీస సమాచారం ఇవ్వకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలనీ స్పష్టం చేశారు. కానీ ఇప్పటివరకూ సమాధానం ఇచ్చిన దాఖలాలు లేవు.
Comments
Please login to add a commentAdd a comment