ముంబై : నగరానికి ఉత్తరాన ఉన్న నాసిక్-త్రయంబకేశ్వర్ పట్టణాల్లో 2015లో జరిగే కుంభమేళాకు సుమారు కోటి మంది హాజరు కావచ్చని రాష్ట్ర ప్రభుత్వం అంచనావేస్తోంది. ఆ మేరకు కనీస సౌకర్యాల ఏర్పాటుకు కృషిచేస్తోంది. దీనికి సంబంధించి శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సీనియర్ మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ..‘ప్రపంచ నలుమూలల నుంచి కుంభమేళా సందర్భంగా ‘సాహీ స్నాన్’కు హాజరయ్యే యాత్రికులకు అవసరమైన భోజన, నివాస వసతులు, మరుగుదొడ్లు, రోడ్లు, రవాణా సదుపాయాలు, బ్రిడ్జీలు వంటి నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించాం.
దీనికోసం రూ.2,380 కోట్ల అంచనా బడ్జెట్‌ను ఆమోదించాం. మేళాకు హాజరయ్యే సుమారు రెండు లక్షల మంది సాధు సంతుల వసతి నిమిత్తం ‘సాధుగ్రామ్’ నిర్మాణాలను కూడా పూర్తిచేయాలని నిర్ణయించామ’ని తెలిపారు. దీని కోసం తగినన్ని కేంద్ర నిధుల సమీకరణకు శనివారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసి కోరనున్నట్లు చవాన్ తెలిపారు. 2015లో కుంభమేళా జూలై 14 నుంచి సెప్టెంబర్ 25 వరకు జరుగుతుంది. ఆగస్టు 29 , సెప్టెంబర్ 13, 18 తేదీల్లో సాహీ స్నానాలను నిర్వహిస్తారు. ప్రతి 12 ఏళ్లకొకసారి మన దేశంలో నాసిక్, త్రయంబకేశ్వర్ సహా ఉజ్జయిన్, అలహాబాద్, హరిద్వార్‌లలో కుంభమేళాను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. 2003లో జరిగిన కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 60 లక్షలమంది హాజరయ్యారు. ఈ మేళా సమయంలో గోదావరి నదిపై రామ్‌కుంద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 29 మంది చనిపోయారు.
ఇదిలా ఉండగా, నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ మహామేళాకు తగిన ఏర్పాట్లు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇతర శాఖలు తగిన సహాయ సహకారాలు అందిస్తున్నాయి.‘సాధారణంగా కుంభమేళాకు హాజరయ్యే యాత్రికులు, తర్వాత దగ్గరలోనున్న షిర్డీ, శని-సింగణాపూర్, భీమశంకర్ వంటి పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకుంటారు. దీంతో ఆయా ప్రాంతాల్లో యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన రక్షణ ఏర్పాట్లతోపాటు మిగతా సదుపాయాలను కూడా సమకూరుస్తున్నాం..’ అని రాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ తెలిపారు.కుంభమేళా ప్రారంభ సమయానికి నాసిక్, సమీప ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నామని రాష్ట్ర టూరిజం, ప్రజాపనుల శాఖ మంత్రి చగన్ భుజ్‌బల్ వివరించారు.
కుంభమేళాకు ముమ్మర ఏర్పాట్లు
Published Sat, Oct 19 2013 12:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
Advertisement
Advertisement